బన్నీ ఫ్యాన్స్ గుడ్ స్టెప్.. ఆ వ్యాక్సిన్ పై అవగాహన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మరోసారి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో ఈ ఏడాది HPV వ్యాక్సిన్ అవేర్ నెస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
By: M Prashanth | 1 April 2026 4:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మరోసారి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో ఈ ఏడాది HPV వ్యాక్సిన్ అవేర్ నెస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆ కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అభిమానుల పవర్ ను సొసైటీని వినియోగించాలనే అల్లు అర్జున్ ఆలోచనకు ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.
HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ అంటే సర్వికల్ క్యాన్సర్ ను నిరోధించే టీకా. ముఖ్యంగా 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయిలకు ఆ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే AAFA సభ్యులు గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.
ఆ అవేర్ నెస్ డ్రైవ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకరోజు కార్యక్రమం కాకుండా ఏడాది పొడవునా కొనసాగనుంది. పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారం, వైద్య శిబిరాలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ వంటి పలు మార్గాల ద్వారా ప్రజలకు HPV వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ వివరించేందుకు ఫ్యాన్స్ కృషి చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించడం, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కల్పించడం ఆ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఇదిలా ఉండగా, ఆ వ్యాక్సిన్ ను భారత ప్రభుత్వం కూడా అనుమతించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉంచిన ఆ టీకా గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. అందుకే AAFA ఆ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు కృషి చేస్తోంది. అల్లు అర్జున్ తన అభిమానులకు ఇచ్చిన సందేశం కూడా కార్యక్రమానికి బలాన్నిస్తోంది.
ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నుంచి నెక్స్ట్ బర్త్ డే వరకు ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ప్రమోట్ చేయాలని అభిమానులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది HPV వ్యాక్సిన్ అవేర్ నెస్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా హెల్త్ కేర్ పై దృష్టి పెట్టారు. AAFA ప్రారంభమైన సమయంలో ఫ్యాన్ అసోసియేషన్స్ పాత్రపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ కే పరిమితం కావాల్సిన అభిమాన సంఘాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సరైనదా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.
అయితే అల్లు అర్జున్ దృష్టిలో అభిమానులు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే శక్తిగా మారాలని ఉద్దేశ్యం ఉంది. యువతలో ఉన్న ఎనర్జీని సరైన దిశగా మళ్లిస్తే ఎంత మంచి ఫలితాలు సాధించవచ్చో ఆ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం పెరగాలని, అవగాహన పెంపొందించడంలో ముందుండాలని అల్లు అర్జున్ సూచిస్తున్నారు! ఏదేమైనా AAFA చేపట్టిన HPV వ్యాక్సిన్ అవేర్ నెస్ డ్రైవ్ ఒక మంచి అడుగు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
