అల్లు ఫ్యాన్స్ మీట్ -2026 : ఐకాన్ స్టార్ ఉదారత గురించే దేశవ్యాప్తంగా చర్చ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతోనే కాకుండా.. తన ఉదార స్వభావంతోనూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంటున్నారు.
By: Sivaji Kontham | 28 July 2026 9:42 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతోనే కాకుండా.. తన ఉదార స్వభావంతోనూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంటున్నారు. బ్లాక్‌బస్టర్ `పుష్ప` చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ, పాన్-ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న బన్ని.. తనపై ప్రేమాభిమానాలు కురిపించే అభిమానుల సంక్షేమం కోసం మరోసారి ముందుకొచ్చారు. తాజాగా నిర్వహించిన AAFA వార్షిక సమావేశం- 2026 వేదికగా తన అధికారిక అభిమానుల సంఘం- అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుల కోసం ప్రత్యేక `ఇన్సూరెన్స్ కవరేజ్` సంక్షేమ పథకాన్ని ఆవిష్కరించి తన పెద్ద మనసును చాటుకున్నారు.
తన అభిమానులను నేరుగా కలిసి వారి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించేందుకు అల్లు అర్జున్ ఈ ఏఏఎఫ్ఏ వార్షిక సదస్సును ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా వంటి పలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమాన సంఘాల నాయకులు, ప్రతినిధులు, సభ్యులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 900 మంది అభిమానులతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కేవలం అతిథిగా వచ్చి వెళ్లడమే కాకుండా..తన సమయాన్ని పూర్తిగా అభిమానులకే కేటాయించారు. సుమారు 4 నుంచి 5 గంటల పాటు ఓపికగా వేదికపైనే ఉంటూ.. వచ్చిన ప్రతీ ఒక్కరితో ముచ్చటించారు. అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారందరితో కలిసి ఫొటోలు దిగారు. అభిమానులతో తనకు ఉన్న ఈ విడదీయరాని ప్రేమానుబంధం, ఆత్మీయ కలయిక అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక వచ్చిన అభిమానుల కోసం బన్ని చేసిన ఏర్పాట్లు అందరినీ మైమరపించాయి. స్వయంగా అభిమానులందరికీ కడుపునిండా భోజనం వడ్డించడంతో పాటు.. వారికి గుర్తుండిపోయేలా ప్రత్యేకమైన పోర్ట్రెయిట్ ఫొటోలను బహుమతులుగా అందించారు. కేవలం రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తాను ``బంగారు మనసున్న సూపర్ స్టార్`` అని.. తనపై అభిమానులు చూపే నిరపేక్షమైన ప్రేమకు ఏదీ సాటి రాదని ఈ సందర్భంగా ఆయన మరోసారి నిరూపించారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి బన్ని తన అభిమానులను కలవనున్నారని సమాచారం.
సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో చేయని విధంగా తన అభిమానుల భవిష్యత్తుకు, వారి కుటుంబాలకు రక్షణగా నిలిచేలా హెల్త్-లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఆవిష్కరించడం ఒక అరుదైన, విశిష్టమైన అడుగుగా నిలిచింది. అభిమానుల కోసం ఆలోచించి ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టిన అల్లు అర్జున్ ఉదారతపై సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రీల్ హీరోగా మాత్రమే కాదు.. రియల్ హీరోగానూ ఆయన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇక ఈ వేదికపై అల్లు అర్జున్ సోషల్ మీడియా హేటర్స్ ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అలాంటి వాటి కోసం తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు చెప్పడం అందరి మనసులను గెలుచుకుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా అనే చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోను భారీ చిత్రంలో నటించనున్నారు.
