అయాన్ విషయంలో బన్నీ చెప్పింది నిజమే!
ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించే అల్లు అర్జున్ ఈసారి మాత్రం చాలా క్యాజువల్ గా కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 9 Aug 2025 12:00 AM ISTపుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో తన క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్, అట్లీతో ఓ భారీ ప్రాజెక్టును చేస్తుండగా, ఆ సినిమా కోసం బన్నీ ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. మొన్నీమధ్యే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన బన్నీ, ఇప్పుడు ముంబైలో ఫ్యామిలీ టైమ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
అయితే సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కనిపిస్తే వారిని ఫోటోలు, వీడియోలు తీసి నానా హంగామా చేయడం కామనైపోగా, ఇప్పుడు బన్నీ ఫ్యామిలీని కూడా అలానే కెమెరాలు చుట్టుముట్టాయి. రీసెంట్ గా బన్నీ తన భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో కలిసి ముంబైలోని బాంద్రాలో డిన్నర్ కు వచ్చినట్టు తెలుస్తోంది. డిన్నర్ ను ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలోనే బన్నీ ఫ్యామిలీ కెమెరాలకు చిక్కింది.
ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించే అల్లు అర్జున్ ఈసారి మాత్రం చాలా క్యాజువల్ గా కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేశారు. స్నేహ కూడా ఈ ఫోటోల్లో చాలా సింపుల్ గా కనిపించింది. బన్నీ ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ వీడియోలో రెండు విషయాలు హైలైట్ గా నిలిచాయి. కెమెరాల ఫ్లాష్‌లన్నీ తమ కళ్లల్లో పడటంతో ఇబ్బందిగా ఫీలైన బన్నీ వారికి వద్దని చెప్పలేక తన కూతురు అర్హ కళ్లకు తన చేతులను అడ్డు పెట్టి కూతురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అందరినీ దృష్టినీ ఆకర్షించింది.
అయితే ఆ కెమెరా ఫ్లాష్ ల వల్ల ఐ విజన్ సరిగా ఉండదనే విషయం తెలిసిందే. దీంతో తన తండ్రి కారులోకి ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు అయాన్ కు అనిపించిందో ఏమో తెలియదు కానీ కారులో నుంచి అయాన్ బన్నీకి తన చేతిని అందించి కారులోకి ఎక్కమని చెప్పడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. గతంలో బన్నీ ఓ కార్యక్రమంలో అయాన్ గురించి మాట్లాడుతూ, అయాన్ కు తండ్రి అంటే ఎంతో ఇష్టమని, యానిమల్ లో రణ్‌బీర్ కపూర్ లాంటోడని చెప్పగా, ఇప్పుడా విషయాన్ని గుర్తు చేసుకుంటూ బన్నీ చెప్పింది ముమ్మాటికీ నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు.
