హైకోర్టులో బన్నీకి ఫేవర్ గానే ఆ ఆదేశాలు
దీంతో ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, ఆయన బ్రాండ్ వాల్యూకు నష్టం కలిగే ప్రమాదం ఉందని వాదించారు.
By: M Prashanth | 17 April 2026 2:42 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో వార్తల్లో నిలిచారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ ను కమర్షియల్ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును తాజాగా ఆశ్రయించారు. పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం దాఖలు చేసిన ఆ సివిల్ సూట్ పిటిషన్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ తరఫున న్యాయవాది స్వాతి సుకుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన వివరాల ప్రకారం, కొన్ని సంస్థలతోపాటు కొందరు వ్యక్తులు ఆయనకు సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆయన వాయిస్ ను క్లోన్ చేసి, ఆయనలా మాట్లాడే యాప్ లను సృష్టించడం వంటి చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.
దీంతో ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, ఆయన బ్రాండ్ వాల్యూకు నష్టం కలిగే ప్రమాదం ఉందని వాదించారు. ఆ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ తుషార్ రావు, నటుడి వాదనను పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అల్లు అర్జున్ కు అనుకూలంగా ఆర్డర్ ఇస్తామని చెప్పారు. అనుమతి లేకుండా సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం తప్పని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది.
అయితే తదుపరి విచారణలో దీనిపై స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగంలోకి రావడంతో డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్ వంటి ఘటనలు పెరుగుతున్నాయి. సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రకటనలు రూపొందించడం, వారి వాయిస్ ను అనుకరించడం వంటి చర్యలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. అవి కేవలం వారి వ్యక్తిగత హక్కులకు మాత్రమే కాకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే ప్రమాదం కూడా కలిగి ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తమ హక్కులను కాపాడుకునేందుకు పలువురు ప్రముఖులు గతంలో కోర్టులను ఆశ్రయించారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, అనిల్ కపూర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులు తమ పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసుల్లో కోర్టులు సెలబ్రిటీల గోప్యత, వ్యక్తిత్వ హక్కులు రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి.
అదే విధంగా మోహన్ లాల్, నాగార్జున, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి అంశాలపై కోర్టు సహాయం కోరిన విషయం తెలిసిందే. ఆ తీర్పులు సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అయితే ఒకవైపు న్యాయపరమైన పోరాటం కొనసాగుతుండగా.. మరోవైపు అల్లు అర్జున్ తన సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాకా చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఆ మూవీ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. సినిమాలో బన్నీ విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు.
