అలాంటి బన్నీ మళ్లీ ఎప్పటికో..
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అట్లీతో రాకా, లోకేశ్ కనగరాజ్‌తో AA 23, సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా లైనప్‌లో ఉన్నాయి. అయితే హ్యాపీ, రేసుగుర్రం, జులాయి తరహాలో పూర్తి కామెడీ ప్రధానమైన పాత్రలో బన్నీ కనిపించే సినిమా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
By: M Prashanth | 27 Nov 2026 10:52 AM ISTపుష్ప తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. పుష్పరాజ్ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ బన్నీని పాత సినిమాల్లో చూసినవాళ్లకు మరో వెర్షన్ కూడా గుర్తుంటుంది. సరదాగా డైలాగ్స్ చెబుతూ, కామెడీ సీన్స్‌లో తన టైమింగ్‌తో నవ్వించే బన్నీ. ఇప్పుడు ప్రకటించిన లైనప్ చూస్తే అలాంటి పాత్రలో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారనే సందేహం రావడం సహజమే.
కరుణాకరన్ తీసిన హ్యాపీ అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా టీవీలో వచ్చినప్పుడు చూసే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. ఆ సినిమాలో బన్నీ, జెనీలియా మధ్య వచ్చే సన్నివేశాలు, హీరో చేసే అల్లరి మామూలుగా ఉండవు. ఇక రేసుగుర్రంలో లక్కీ పాత్ర బన్నీ కామెడీ టైమింగ్‌కు మంచి ఉదాహరణ. యాక్షన్ ఉన్నా సినిమా అంతా సీరియస్‌గా ఉండదు. సురేందర్ రెడ్డి ఆ క్యారెక్టర్‌ను సరదాగా నడిపించిన తీరు బ్లాక్‌బస్టర్‌కు బాగా ఉపయోగపడింది.
జులాయిలో త్రివిక్రమ్ డైలాగ్స్‌ను బన్నీ పలికించిన విధానం కూడా గుర్తుండిపోతుంది. అలా వైకుంఠపురములో బంటు పాత్రలోనూ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మంచి స్కోప్ దొరికింది. పుష్పలో కూడా అక్కడక్కడా సరదా సన్నివేశాలున్నాయి. కానీ ఆ సినిమాకు ప్రధానంగా ఉపయోగపడింది పుష్పరాజ్ రఫ్ క్యారెక్టర్, యాక్షన్, ఎమోషన్. రెండు భాగాల కోసం బన్నీ ఎక్కువ కాలం అదే లుక్‌లో కొనసాగారు.
ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రాకా చేస్తున్నారు. భారీ విజువల్స్, ఫాంటసీ అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో AA 23 ప్రకటించారు. లోకేశ్ గత సినిమాలు చూస్తే యాక్షన్, ఇంటెన్స్ క్యారెక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ కూడా ప్రకటించారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే షెడ్యూల్ ఇంకా లేదు. ఈ కాంబినేషన్లన్నీ చూస్తే హ్యాపీ, రేసుగుర్రం తరహా లైట్ కామెడీ సినిమాకు ఇప్పటికైతే చోటు కనిపించడం లేదు.
అయితే భారీ సినిమా అంటే కామెడీ ఉండకూడదనే రూల్ లేదు. బన్నీకి ఫైట్స్, డ్యాన్స్‌తో పాటు కామెడీని కూడా తన బాడీ లాంగ్వేజ్‌తో పండించే టాలెంట్ ఉంది. అట్లీ సినిమాల్లోనూ ఎంటర్టైన్మెంట్కు చోటుంటుంది. కానీ బన్నీనే పూర్తి సరదా క్యారెక్టర్లో చూపించే కథ కావాలంటే దర్శకుడు ఆ కోణంలో రాయాల్సి ఉంటుంది. పైగా పాన్ ఇండియా మార్కెట్ పెరిగాక ప్రతి సినిమాను పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అందుకే చిన్న కథ చేసినా అది వేగంగా పూర్తయ్యే సినిమా అవుతుందనే గ్యారంటీ లేదు. ఇటీవల ఎన్టీఆర్ కూడా భారీ యాక్షన్ ప్రాజెక్టుల మధ్య అనిల్ రావిపూడితో సినిమా ప్రకటించారు. బన్నీకి మాత్రం అలా కామెడీ ప్రధానంగా ఉండే దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. ఇప్పట్లో అయ్యేలా కూడా కనిపించడం లేదు. నెక్ట్స్ సైనా తరువాత ఏదైనా గ్యాప్ లో చేస్తాడేమో చూడాలి మరి.
