బోయపాటి తో బన్నీ లెక్క తేలాల్సిందే?
నిజానికి అల్లు అరవింద్ గతంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 5 Oct 2026 10:40 PM ISTటాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను. `అఖండ ` తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ నెల చివరి నాటికి తన కొత్త సినిమా ప్రకటన ఉంటుందని ప్రకటించడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారైనా మాస్ డైరెక్టర్ ఎవరితో సినిమా చేయబోతున్నారు? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో `సరైనోడు` వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్‌తో బోయపాటి మరోసారి జతకట్టబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి అల్లు అరవింద్ గతంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు తగ్గట్టుగానే తాజాగా బన్నీ-బోయపాటి మధ్య కొన్ని కీలకమైన స్టోరీ డిస్కషన్స్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. `పుష్ప` వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో `రాకా` సినిమా చేస్తున్నారు. దీని అనంతరంలోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నారు. ఇలాంటి పాన్ ఇండియా దశలో ఉన్న బన్నీ కోసం బోయపాటి ఎలాంటి పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారన్నదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రధాన ప్రశ్న.
బోయపాటి సినిమాల్లో మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనవసరం లేదు. `సరైనోడు` చిత్రంలో బన్నీని ఎంత మాస్ యాంగిల్‌లో చూపించారో? తెలిసిందే. ఇప్పుడు అదే జోడీ మళ్లీ రిపీట్ అయితే అది టాలీవుడ్ వరకే పరిమితం కాదు. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ప్లాన్ చేసిన సినిమాను బన్నీ రద్దు చేసుకున్న ఉదంతం చూస్తుంటే.. కథ విషయంలో బన్నీ ఎంత పక్కాగా ఉంటున్నారో? అర్థమవుతుంది. బోయపాటి వినిపించిన కథ పూర్తి సంతృప్తి ఇస్తేనే బన్నీ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నా? ఇద్దరి మధ్య లెక్కలు సరిగ్గా కుదిరితే మాత్రం సినిమా ప్రకటన ఎప్పుడైనా వెలువడే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగా, బోయపాటి తన మార్క్ మాస్ ఎమోషన్స్, పొలిటికల్ లేదా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను మిక్స్ చేసి ఓ సరికొత్త కథను లాక్ చేసే పనిలో ఉన్నట్లు తెలు స్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం థియేటర్లలో పూనకాలు ఖాయమని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నెలఖరుకు బోయపాటి తదుపరి ప్రాజెక్ట్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో ఆ ప్రకటనలో బన్నీ పేరు ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబో కనుక నిజమైతే ఇండియన్ సినిమా తెరపై మరో రికార్డ్ బ్రేకింగ్ మాస్ ఎంటర్‌టైనర్ రావడం పక్కా అనే మాట బలంగా వినిపిస్తోంది.
