బన్నీ- బసిల్ జోసెఫ్ స్టోరీ ఫైనల్ అయినట్టేనా?
మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న బసిల్ జోసెఫ్ `మిన్నల్ మురళి`తో దర్శకుడిగా అంతకు మించిన పేరుని, పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.
By: Ravindar Gorantla | 9 March 2026 10:00 PM ISTమలయాళ ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న బసిల్ జోసెఫ్ `మిన్నల్ మురళి`తో దర్శకుడిగా అంతకు మించిన పేరుని, పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ గురించి రాజమౌళి ప్రశంసలు కురిపించాడంటే బసిల్ జోసెఫ్ దర్శకుడిగా ఏస్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా జయ జయ జయ జయహే, గురువయూర్ అంబాలనడయిల్, సూక్ష్మ దర్శిణి వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న బసిల్ జోసెఫ్ దర్శకుడిగా `కుంజిరామాయణం`, గోధా వంటి సినిమాలు చేశాడు.
అయితే అతనికి దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది మాత్రం టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన `మిన్నల్ మురళి`. సూపర్ హీరో మూవీగా రూపొందిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై అక్కడ టాప్‌లో నిలిచి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో సూపర్ హీరో స్టోరీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథనాయకుడిగా బసిల్ జోసెఫ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. శక్తిమాన్ తరహా స్టోరీతో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుందని అంటున్నారు.
ఈ వార్తల నేపథ్యంలో మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహ వేడుకలో కనిపించడం, బన్నీ ప్రత్యేకంగా తనతో కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో వీరిద్దరి కలయికలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనే క్లారిటీ వచ్చేసింది. దీంతో బసిల్ జోసెఫ్ ఐకాన్ స్టార్‌ని ఎలా చూపించబోతున్నాడు? ఎలాంటి కథని సిద్ధం చేశాడు? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బన్నీ తన 22వ ప్రాజెక్ట్‌ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదొక సూపర్ హీరో మూవీ. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీనితో పాటు లోకేష్ కనగరాజ్ తో 23వ ప్రాజెక్ట్‌కు అల్లు అర్జున్ శ్రీకారం చుట్టడం, ఇటీవలే అనౌన్స్‌మెంట్ వీడియోని అధికారికంగా విడుదల చేయడం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో బన్నీ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో బసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ పరిస్థితేంటనే చర్చ మొదలైంది. ఈ రెండు సినిమాల కారణంగా బసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్లేనని వార్తలు షికారు చేశాయి.
అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ శిరీష్ వివాహవేడుకలో బసిల్ జోసెఫ్ కనిపించడం, బన్నీతో కలిసి ప్రత్యేకంగా ఫొటోలకు పోజులివ్వడంతో ఈ కాంబినేషన్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సగటు సినీ లవర్ చర్చించుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని గీతా ఆర్ట్స్ స్వయంగా నిర్మిస్తుందని, ఇప్పటికే బసిల్ జోసెఫ్ లైన్ వినిపించాడని, అయితే ఇది ఇంతకు ముందు ప్రచారం జరిగినట్టేగా శక్తిమాన్ తరహా సూపర్ హీరో సినిమా కాదని, సరికొత్త నేపథ్యంలో సాగే సూపర్ హీరో మూవీ అని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.
