బాలీవుడ్ (X) టాలీవుడ్: సైన్స్ ఫిక్షన్‌లోను తెలుగోడే
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ ప్రకటన చేసేందుకు అట్లీ బృందం సిద్ధమవుతోందని సమాచారం.
By: Sivaji Kontham | 23 Sept 2025 10:48 AM ISTబాలీవుడ్ లో రా-వన్ లాంటి సైన్స్ ఫిక్షన్ ప్రయోగం తెరకెక్కి చాలా కాలమే అయింది. కింగ్ ఖాన్ షారూఖ్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నారు. సాంకేతికంగా అద్భుతంగా తెరకెక్కించినా కానీ `ఆత్మ` కనెక్ట్ కాలేదని విమర్శలొచ్చాయి. భారీ బడ్జెట్లు ఖర్చు చేస్తే సరిపోదు.. వినోదంతో పాటు ఎమోషన్ కనెక్టయితేనే సినిమా థియేటర్లలో ఆడుతుందని నిరూపణ అయింది. రా-వన్ ఫెయిల్యూర్ షారూఖ్ ని చాలా కాలం పాటు వెంటాడింది.
అందుకే ఇప్పుడు టెక్నాలజీ బేస్ చేసుకుని అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు అనగానే అందరి దృష్టి అటువైపు ఉంది. ఈ సినిమాని మాస్ యాక్షన్ సినిమాలు తీసిన అట్లీ కుమార్ తెరకెక్కిస్తుండడంతో అతడు సాంకేతికంగా దీనిని ఎలా డ్రైవ్ చేస్తాడో చూడాలనే క్యూరియాసిటీ నెలకొంది. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టును అతడు ఎంచుకున్నాడు. ఇందులో సూపర్ హీరో పాత్రలతో భారీ యాక్షన్ అడ్వెంచర్ చేయించేందుకు సిద్ధమయ్యాడు. దీనిని హాలీవుడ్ మూవీ `ట్రాన్` రేంజులో అతడు తెరకెక్కిస్తాడా? అన్న చర్చ సాగుతోంది. వెబ్ లో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ఇప్పటికే రక్తి కట్టిస్తున్నాయి.
ఈ సమయంలో అల్లు అర్జున్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ ప్రకటన చేసేందుకు అట్లీ బృందం సిద్ధమవుతోందని సమాచారం. ఈ చిత్రంలో కీలక నటీనటుల గురించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా గుసగుస వినిపిస్తోంది. కీలక పాత్రల్లో.. హిందీ చిత్రసీమ ప్రముఖులకు అట్లీ ప్రాధాన్యతనిస్తున్నారా? లేదా దక్షిణాదికి చెందిన నటులను అతడు ఎంపిక చేసుకుంటున్నాడా? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది. అల్లు అర్జున్ తో పాటు ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే దానిపై అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తోంది. మరోవైపు సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
బన్ని ప్రయత్నం చూస్తుంటే, ప్రభాస్ కి ధీటుగా పాన్ ఇండియాలో దూసుకెళ్లే సత్తా ఉన్న హీరో అతడేనని అంచనా వేస్తున్నారు. బాహుబలి, సాహో లాంటి భారీ ప్రయోగాలతో ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాడు. ఇప్పుడు అల్లు అర్జున్ `పుష్ప` ఫ్రాంఛైజీ తర్వాత సైన్స్ ఫిక్షన్ సినిమాలతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాడని భావిస్తున్నారు. భారతదేశంలో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు చాలా వచ్చినా కానీ, ఈ స్థాయి బడ్జెట్, ఈ రేంజు కాస్టింగ్ తో మాత్రం గతంలో రాలేదని చిత్రబృందం చెబుతోంది. ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి తగ్గ సాంకేతికతను ఉపయోగించుకుని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. ఐకాన్ స్టార్ కెరీర్‌కి ఈ సినిమా నిజమైన బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.
