'రాకా'.. అంత టెన్షన్ ఎందుకు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
By: M Prashanth | 18 May 2026 12:12 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా.. హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇప్పటికే రాకా మూవీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో అల్లు అర్జున్ పోషిస్తున్న రాకా రోల్ ఆయన కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ గా ఉండబోతుందనే టాక్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. మరోవైపు సినిమా కథ కూడా కొత్త తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. ప్యారలల్ వరల్డ్ అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ఆధారంగా సినిమా రూపొందిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్ గప్ చుప్ గా కొనసాగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండగా, మరికొంత మంది హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి వార్తలు అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచాయి. ఇప్పుడు ఓ భారీ ఫ్లైట్ లో స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ ను మేకర్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఆ సీక్వెన్స్ ను అట్లీ హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. భారీ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి ఆ సన్నివేశాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారట.
అయితే సినిమా అప్డేట్స్ అన్నీ అభిమానుల్లో పుల్ గా హైప్ పెంచుతున్నప్పటికీ, ఇప్పుడు మరో విషయం మాత్రం బన్నీ అభిమానులను టెన్షన్ కు గురిచేస్తోంది. అదే మ్యూజిక్. రాకాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలకు సంగీతం ఎంత పెద్ద బలం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా పుష్ప సిరీస్ చిత్రాల తర్వాత ఆయన సినిమాలపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే రాకాకు కూడా చార్ట్ బస్టర్ ఆల్బమ్ క్రియేట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇటీవల విడుదలైన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన వీరభద్రుడు సినిమాకు సాయి అభ్యంకర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేవని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. దీంతో రాకా విషయంలో కూడా అభిమానుల్లో కొంత ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది.
అయితే సినీ ప్రియులు మాత్రం ఒక్క సినిమా ఫలితాన్ని చూసి సంగీత దర్శకుడి పనితీరును అంచనా వేయడం సరైంది కాదని చెబుతున్నారు. కథ, సన్నివేశాలు, దర్శకుడి విజన్ కు తగ్గట్టే సంగీతం మారుతుందని, రాకా లాంటి భారీ ప్రాజెక్ట్ కు సాయి అభ్యంకర్ తన బెస్ట్ ఇవ్వొచ్చని అభిప్రాయపడుతున్నారు. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదేమోనని అంటున్నారు. మొత్తానికి గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు మ్యూజిక్ విషయంలోనూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
