బన్నీ - అట్లీ మూవీకి కళ్ళు చెదిరే భారీ ఓటీటీ డీల్.. ఎన్ని వందల కోట్లంటే?
ప్రస్తుతం సినీ ప్రేక్షకుల చూపంతా ఇండస్ట్రీలో రాబోతున్న భారీ సినిమాల పైనే ఉంది.
By: Madhu Reddy | 18 Sept 2025 1:38 PM ISTప్రస్తుతం సినీ ప్రేక్షకుల చూపంతా ఇండస్ట్రీలో రాబోతున్న భారీ సినిమాల పైనే ఉంది. అలా రాజమౌళి - మహేష్ బాబు, అల్లు అర్జున్ - అట్లీ, ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్, రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాల పైనే అందరి ఫోకస్ ఉంది. అయితే వీటన్నింటిలో చూసుకుంటే.. అల్లు అర్జున్ - అట్లీ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అదేంటంటే అల్లు అర్జున్ - అట్లీ మూవీకి భారీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందట. మరి ఇంతకీ అల్లు అర్జున్ - అట్లీ మూవీ హక్కులను కొనుగోలు చేసిన ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏంటి..?ఎన్ని కోట్లు పెట్టి డీల్ ఓకే చేసుకున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అందుతూనే ఉంది. పుష్ప-2 మూవీ భారీ విజయం సాధించాక అల్లు అర్జున్ హాలీవుడ్ స్థాయిలో ఓ యోధుడి నేపథ్య కథతో రాబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అలా అట్లీ మూవీలో అల్లు అర్జున్ ఓ పవర్ఫుల్ యోధుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా దీపిక పదుకొనే నటించగా.. జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ లు ప్రత్యేక పాత్రల్లో కనిపించబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో వర్క్ షాప్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. అతి త్వరలో దుబాయ్ లో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకి సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాలో హై-ఎండ్ విజువల్స్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ ని కలిశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి సాయి అభ్యాంకర్ సంగీతం సమకూర్చగా.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ హాలీవుడ్లో జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే అల్లు అర్జున్ మీద ఒక ఎంట్రీ సాంగ్ కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ముంబైలో నిర్మాతలు, నటులు, దర్శకుల కోసం స్టార్ స్టాడెడ్ పార్టీని నిర్వహించారు. అయితే ఈ పార్టీకి అల్లు అర్జున్, అల్లు అరవింద్, అట్లీతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. అంతేకాదు ఇక్కడే అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న AA22xA6 సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్టు కూడా ధృవీకరించారు. దీంతో ఈ విషయం క్షణాల్లో ఇండస్ట్రీ మొత్తం వైరల్ అయింది. అయితే అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ సుమారుగా 280 నుండీ 300 కోట్ల భారీ ధర పెట్టి హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే కళ్ళు చెదిరే రేంజ్ లో ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకోవడం గమనార్హం.
