Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు ధ‌మాకా ట్రీట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠతో వేచి చూస్తున్న సమయమిది.

By:  Sivaji Kontham   |   6 April 2026 10:21 PM IST
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు ధ‌మాకా ట్రీట్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠతో వేచి చూస్తున్న సమయమిది. 2026 ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇప్పటికే సందడి మొదలవ్వగా.. చిత్ర యూనిట్ అంతకంటే ఒకరోజు ముందే అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `AA22xA6`కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను రేపు (ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో రేపటి నుండే బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ మరో లెవల్‌కు చేరుకోనున్నాయి.

పుష్పరాజ్‌గా సంచలనాలు సృష్టించిన అల్లు అర్జున్ ఈసారి అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతుండటం విశేషం. రేపు విడుదల కాబోయే అప్‌డేట్‌లో సినిమా టైటిల్ పోస్టర్ లేదా ఒక చిన్న గ్లింప్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ గ్లింప్స్‌లో బన్నీ మార్క్ స్టైల్ ఎలా ఉండబోతోంది? అట్లీ విజన్ ఏంటి? అనే విషయాలపై క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

ఈ భారీ ప్రాజెక్టులో నటీనటుల ఎంపిక కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. ఇంతటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాంకేతిక నిపుణుల విషయంలోనూ అట్లీ ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి క్రూని ఈ సినిమా కోసం రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

హాలీవుడ్‌లో ఇప్పటికే అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చినా కానీ.. అట్లీ-బన్నీ కాంబో భారతీయ నేటివిటీకి తగ్గట్టుగా ఎలాంటి భిన్నమైన కంటెంట్‌ను అందిస్తారో చూడాలి. కేవలం ఒక చిన్న గ్లింప్స్‌తో సినిమా కథాంశంపై పూర్తి స్పష్టత రావడం కష్టమే అయినా.. ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో రేపు తెలిసిపోనుంది. హాలీవుడ్ తరహాలో సినిమా విడుదలకు ముందు మూడు నాలుగు ట్రైలర్లను వదిలితే ప్రేక్షకులకు కాన్సెప్ట్‌పై మరింత క్లారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి రేపు ఉదయం 11 గంటలకు ఎర్త్ షేక్ అయ్యే అప్‌డేట్ ఐకాన్ స్టార్ ఇవ్వ‌బోతున్నార‌నే కుతూహాలం ఫ్యాన్స్ లో ఉంది. ఈ చిత్రం బ‌న్ని కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచేలా ప్లాన్ చేయ‌డంతో అంత‌కంత‌కు ఉత్కంఠ పెంచుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో అల్లు అర్జున్ చేస్తున్న ఈ భారీ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఎల్లుండి బన్నీ పుట్టినరోజు అయినా ఒక రోజు ముందే పండ‌గ మొద‌లైంది. ఏప్రిల్ 8న మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌ని అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.