ట్రెండీ స్టోరి: ఏకంగా హాలీవుడ్‌కే గురి పెట్టారు
మంచి సత్సంబంధాలు దేనికైనా దారి తీయొచ్చు! ఆ రకంగా చూస్తే, భారతీయ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో అజేయంగా దూసుకుపోవడానికి కొందరు క్రియేటర్స్ ప్రదర్శించిన చొరవ ప్రధాన కారణం.
By: Sivaji Kontham | 26 Aug 2025 9:56 AM ISTమంచి సత్సంబంధాలు దేనికైనా దారి తీయొచ్చు! ఆ రకంగా చూస్తే, భారతీయ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో అజేయంగా దూసుకుపోవడానికి కొందరు క్రియేటర్స్ ప్రదర్శించిన చొరవ ప్రధాన కారణం. ప్రభాస్ - రాజమౌళి కాంబినేన్ `బాహుబలి`, అమీర్ ఖాన్ `దంగల్`, `పీకే` చిత్రాలతో అంతర్జాతీయ మార్కెట్ మనకు దక్కింది. భారతదేశంలో తెరకెక్కిన చాలా సినిమాలకు ఇప్పుడు దేశ విదేశాల్లో మార్కెట్ ఏర్పడటానికి ఇవి దారి చూపాయి. అయితే ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోయిన ఈ తరుణంలో, హాలీవుడ్ సినిమాల విస్త్రత మార్కెట్ ని ఇండియన్ సినిమా అందిపుచ్చుకోవడం ఎలా? హాలీవుడ్ క్రిటిక్స్, గోల్డెన్ గ్లోబ్స్, ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల్లో హవా సాగించడం ఎలా?
ఇన్ని కోణాల్లో ఆలోచిస్తే.. భారతీయ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లో వెనకబాటు నుంచి బయటపడాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి బృందం పెద్ద ప్రయత్నం సఫలమై ఆస్కార్- గోల్డెన్ గ్లోబ్- హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు దక్కాయి. తద్వారా తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయమైంది. రాజమౌళి టీమ్ తదుపరి మహేష్ 29 చిత్రాన్ని ఒక హాలీవుడ్ సినిమా రేంజుకు తగ్గకుండా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది చాలా మార్కెట్లకు దారులు తెరవనుంది.
ఇంతలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రేసులో చేరారు. అల్లు- అట్లీ కాంబినేషన్ మూవీ AA22XA6 ని గ్లోబల్ మార్కెట్లో పరుగులు పెట్టించాలనే తపన తొలి నుంచి కనిపిస్తోంది. ఈ సినిమాని సోషియో ఫాంటసీ- సైన్స్ ఫిక్షన్ కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు వీఎఫ్ఎక్స్ సహా పలు విభాగాల్లో పని చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా కోసం అసాధారణ బడ్జట్లను కేటాయించామని చిత్రబృందం వెల్లడించింది.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా ప్రమోషనల్ స్ట్రాటజీని కొత్తగా పరుగులు పెట్టించనున్నారని లీకులు అందుతున్నాయి. అట్లీ బృందం ప్రస్తుతం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో కలిసి పని చేస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా కోనెక్ట్ మోబ్‌సీన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఇ విస్కోంటి ముంబైలో అడుగుపెట్టడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. రెండు దశాబ్ధాలకు పైగా పలు ప్రముఖ స్టూడియోలతో పని చేసిన అలెగ్జాండ్రా అవతార్, డూన్, జురాసిక్ వరల్డ్, బార్బీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సహా వంద పైగా చిత్రాలకు పని చేసారు. ముఖ్యంగా క్రియేటివ్ ప్రమోషన్స్ పరంగా అలెగ్జాండ్రా సుప్రసిద్ధులు. ఆమె మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు అల్లు - అట్లీ సినిమాకి ప్రధాన బలంగా మారనుందని అంచనా వేస్తున్నారు. అలెగ్జాండ్రా ప్రస్తుతం ముంబై పరిశ్రమతో పాటు, ప్రాంతీయ భాషా చిత్రాలకు చెందిన దిగ్గజాలతో కలిసి పని చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
హాలీవుడ్ ని ఢీకొట్టే సత్తా భారతీయ సినిమాకి ఉంది. దీనిని ఆర్.ఆర్.ఆర్ తర్వాత నిరూపించాలనే పంతం మన పెద్ద హీరోలకు ఉంది. అల్లు అర్జున్ - అట్లీ బృందం చేస్తున్న ప్రయత్నం పెద్ద సక్సెసవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపైనా భారతీయ చిత్రాల మార్కెట్ రేంజును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, కొత్త దారి చూపించే బాధ్యతను సౌత్ ప్రముఖులు తీసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
