అల్లు అర్జున్ న్యూ ఇయర్ ప్లాన్ ఏంటంటే...!
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' సినిమా వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి అయింది. కానీ ఇప్పటి వరకు బన్నీ నుంచి కొత్త సినిమా రాలేదు.
By: Ramesh Palla | 29 Dec 2025 11:11 AM ISTఅల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' సినిమా వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి అయింది. కానీ ఇప్పటి వరకు బన్నీ నుంచి కొత్త సినిమా రాలేదు. 2025లో ఆయనను వెండి తెరపై చూసే అవకాశం అభిమానులు దక్కించుకోలేదు. గత ఏడాది చివర్లో పుష్ప 2 వచ్చింది కనుక ఈ ఏడాది ఆయన సినిమా ఉండక పోవచ్చు అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే 2025 ను బన్నీ పూర్తిగా వదిలేశాడు. కానీ 2026ను మాత్రం అలా ఊరికే వదిలేసే ప్రసక్తే లేదని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా మొదలు అయింది. సినిమా ప్రకటన అయితే వచ్చింది కానీ ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు చీకట్లో బాణం అన్నట్లుగా వచ్చిన ప్రతి పుకారును నమ్మేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు వీరి కాంబో మూవీ షూటింగ్ దాదాపుగా సగం వరకు పూర్తి అయింది, బ్యాలన్స్ వర్స్‌ను కొత్త ఏడాదిలో ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా...
తెలుగు హీరో అయినప్పటికీ, తమిళ దర్శకుడు అయినప్పటికీ సినిమాను ఇప్పటి వరకు పూర్తిగా ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరించడం జరిగింది. అలా ఎందుకు చేశారు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. హీరోయిన్ విషయంలో ఇబ్బంది రాకుండా అక్కడ షూట్ చేసి ఉంటారు అనేది కొందరి మాట. ఆ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు ఇన్‌డోర్ షూట్ చేశారు. ఇక మీదట అన్నీ కూడా ఔట్ డోర్ షూట్స్ ఉంటాయని తెలుస్తోంది. అయితే ఔట్ డోర్ షూట్స్ ను ఇండియాలో కూడా పలు దేశాల్లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. కథానుసారంగా ఎక్కువ సన్నివేశాలు విదేశాల్లో ఉంటాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే కొత్త షెడ్యూల్స్ ను ప్లాన్ చేయబోతున్నారట. న్యూ ఇయర్ పార్టీని ఫ్యామిలీతో బన్నీ, అట్లీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత షూటింగ్ కి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొత్త ఏడాదిలో బన్నీ మూవీ షూటింగ్...
మొదటగా అల్లు అర్జున్ పై కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం అట్లీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దుబాయిలో మొదలు పెట్టించారని తెలుస్తోంది. లొకేషన్ రెక్కీ నిర్వహించారని, త్వరలోనే అక్కడికి టీం వెళ్లి షూటింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దుబాయిలోని ఎడారిలో బన్నీ పై యాక్షన్ సీన్ ఉంటుందట. ఆ యాక్షన్ సీన్ లో పెద్ద ఎత్తున ఫైటర్స్ ముఖ్యంగా విదేశీ ఫైటర్స్ ను అట్లీ రంగంలోకి దించుతాడని అంటున్నారు. మొత్తానికి ఇద్దరికి గత చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరికి అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే సినిమా విషయంలో ఎక్కడా రాజీ లేకుండా దర్శకుడు అట్లీ సినిమాను భారీ బడ్జెట్‌తో, తన గత చిత్రాలను మించి ఉండేలా చిత్రీకరిస్తున్నాడు అంటూ షూటింగ్‌లో పాల్గొన్న కొందరు ఆఫ్ లైన్‌లో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ - అట్లీ మూవీ అప్‌డేట్
ఇప్పటి వరకు సినిమా కి సంబంధించిన టైటిల్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ రకరకాలుగా పుకార్లు మాత్రం షికార్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలోనూ చాలా పుకార్లు షికార్లు చేయడం మనం చూశాం. దీపికా పదుకునే హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె కాకుండా మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ సైతం ఈ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా స్టోరీ లైన్ ఏంటి, నేపథ్యం ఏంటి అనే విషయాలపై స్పష్టత లేదు. కానీ కొత్త ఏడాదిలో మెల్ల మెల్లగా సినిమాను రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కొత్త ఏడాదిలో ఖచ్చితంగా అట్లీ, బన్నీ మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ రావడం ఖాయం. ఆ అప్‌డేట్స్ ను దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ కి 2026 గొప్ప అనుభూతిని కలిగించడం ఖాయం. కొత్త ఏడాది కోసం బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూసే విధంగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరి అట్లీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో చూడాలి.
