Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ పై బన్నీ కామెంట్స్.. తండ్రి మాత్రమే కాదంటూ

హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆ వేదిక పైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

By:  Madhu Reddy   |   13 March 2026 10:54 AM IST
అల్లు అరవింద్ పై బన్నీ కామెంట్స్.. తండ్రి మాత్రమే కాదంటూ
X

హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆ వేదిక పైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అల్లు అరవింద్ కేవలం నిర్మాత మాత్రమే కాదని, ఆయన ఒక విజనరీ అని కొనియాడారు. టెక్నాలజీని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఆయనకున్న పట్టుదల వల్లే నేడు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుందని బన్నీ మాట్లాడారు. తండ్రి అందించిన ఈ గొప్ప వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన మాటిచ్చారు. ఆ విశేషాలు చూద్దాం..

బాక్సాఫీస్ పెంచిన నిర్మాత.. నాకు మాత్రం ఆయనే దేవుడు:

ఈ వేడుకలో అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. "నాన్న కేవలం నన్ను కన్న తండ్రి మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడితో సమానం" అంటూ తన మనసులోని ప్రేమను బయటపెట్టారు. అల్లు అరవింద్ గారు కేవలం బాక్సాఫీస్ లెక్కలు చూసే నిర్మాత కాదని, సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచిన వ్యక్తి అని బన్నీ కొనియాడారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వెనుక లాభాపేక్ష కంటే, తెలుగు సినిమా తమ కుటుంబానికి ఇచ్చిన గుర్తింపునకు కృతజ్ఞతగా ఏదైనా గొప్పగా తిరిగి ఇవ్వాలనే తపన తో మొదలైనది ఈ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. ఇక లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే ఈ 'అల్లు సినిమాస్' రూపంలో సాకారమైందని బన్నీ గర్వంగా చెప్పారు.

డిజిటల్ విప్లవానికి ఆద్యుడు.. ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా:

టెక్నాలజీని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అల్లు అరవింద్ గారిని మించిన వారు లేరని బన్నీ తెలిపారు. ఆ రోజుల్లో కేవలం స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్నప్పుడు, 'మాస్టర్' సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని గుర్తు చేశారు. అలాగే ఫిలిం రీల్స్ యుగం నుంచి డిజిటల్ వ్యవస్థలోకి థియేటర్లను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో "ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా" అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానించే ఆయన తత్వమే ఈరోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని బన్నీ ప్రశంసించారు. అల్లు అరవింద్ గారి ముందుచూపుకు 'ఆహా' (Aha) ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఒక నిదర్శనమని బన్నీ పేర్కొన్నారు. ప్రాంతీయ భాషా చిత్రాల కోసం ప్రత్యేకంగా ఒక వేదికను సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్‌ను హైదరాబాద్‌కు అందించడం ద్వారా మరో మైలురాయిని సృష్టించారని బన్నీ తెలిపారు.

బాక్సాఫీస్ బౌండరీలను చెరిపేసిన నిర్మాత:

ఇక అల్లు అర్జున్ నిర్మాత గా తన టీన్ద్రి ప్రయాణం గురించి మాట్లాడుతూ 'మా నాన్న గురించి మీ అందరికి తెలిసిందే, కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా, సినిమా మార్కెట్ పరిధిని ఎలా పెంచాలో ఆయన నిరూపించారు'ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ రికార్డులు కొడుతూ, తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయిని మరో మెట్టు ఎక్కించారు' అని తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెంచడంలో ఆయన ఒక దార్శనికుడిగా వ్యవహరించారని, పక్కా ప్లానింగ్‌తో సినిమాలను భారీ వసూళ్ల దిశగా నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి అని బన్నీ ప్రశంసించారు. ఇక అంతేకాక అప్పట్లో అమీర్ ఖాన్ హీరోగా ఆయన నిర్మించిన ‘గజని’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 కోట్ల వసూళ్లను సాధించిన సినిమాగా 'గజని' నిలిచిందని, ఆ ఘనత తన తండ్రి అల్లు అరవింద్ గారికే దక్కుతుందని గుర్తు చేశారు.

ఒక తండ్రిగా అల్లు అరవింద్ గారు బన్నీని స్టార్‌ను చేస్తే, ఒక తనయుడిగా బన్నీ తన తండ్రి చేసిన సేవలను ప్రపంచానికి ఈ వేదికగా చాటిచెప్పారు. అల్లు అరవింద్ గారి టెక్నికల్ విజన్, బన్నీ క్రేజ్ కలిసి తెలుగు సినిమాను మరిన్ని శిఖరాలకు చేరుస్తాయని అనడంలో సందేహం లేదు అంటున్నారు ఫాన్స్.