విశాఖలో AAA సినిమాస్ సరే.. అల్లు స్టూడియో నిర్మాణం ఎప్పుడు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ కలిసి టాలీవుడ్ ప్రేక్షకులకు అత్యున్నత థియేటర్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు.
By: Sivaji Kontham | 5 Aug 2026 11:16 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ కలిసి టాలీవుడ్ ప్రేక్షకులకు అత్యున్నత థియేటర్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట AAA సినిమాస్ సాధించిన అద్భుత విజయం తర్వాత.. ఇదే కాంబినేషన్‌లో ఇప్పుడు విశాఖపట్నం వేదికగా సరికొత్త మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంది. వైజాగ్ అభివృద్ధి చెందుతున్న వినోద రంగాన్ని దృష్టిలో ఉంచుకుని... త్వరలోనే ప్రారంభం కానున్న ఇన్ఆర్బిట్ మాల్ ప్రాంగణంలో ఈ భారీ 8 స్క్రీన్స్ మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేశారు.
సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ AAA సినిమాస్ వైజాగ్ మల్టీప్లెక్స్ ఆగస్టు 9న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు అల్లు అర్జున్ స్వయంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తన బిజినెస్ వెంచర్ ఆరంభం కోసం బన్నీ వైజాగ్ రాబోతుండటంతో మెగా అభిమానులు, స్థానిక ప్రజల్లో బోలెడంత ఉత్కంఠ నెలకొంది. ఇటీవల అల్లు అర్జున్ తాను నటించే సినిమాలతో పాటు... థియేటర్ ఎగ్జిబిషన్- స్టూడియోస్ బిజినెస్(హైదరాబాద్ లో భారీ స్టూడియో నిర్మించారు)పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటం విశేషం.
ఈ మల్టీప్లెక్స్ సాంకేతిక పరిజ్ఞానం, ఆడియో-విజువల్ క్వాలిటీ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తోంది. మొత్తం 8 స్క్రీన్లతో నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్‌లో 70 బై 30 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రత్యేకంగా నిలవనుంది. ఏకంగా 491 సీటింగ్ కెపాసిటీ.. అధునాతన డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో డిజైన్ చేసిన ఈ మెయిన్ స్క్రీన్ సెప్టెంబర్ నెల నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
స్క్రీన్ల కెపాసిటీ విషయానికి వస్తే.. ప్రేక్షకులకు వేర్వేరు అనుభూతులను అందించేలా విభిన్న సీటింగ్ సైజులను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన స్క్రీన్లలో వరుసగా 436, 197, 130, 130, 76, 58 .... లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ కోసం 34 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రత్యేక స్క్రీన్లను రూపొందించారు. అత్యంత విలాసవంతమైన సీటింగ్, మైండ్ బ్లోయింగ్ ప్రొజెక్షన్ టెక్నాలజీ , వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో వైజాగ్ ప్రజలకు ఇది సరికొత్త సినిమా అనుభూతిని పంచనుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అతడు నటిస్తున్న `రాకా` చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో తమ అభిమాన నటుడి కొత్త వ్యాపార సామ్రాజ్యమైన AAA సినిమాస్ విశాఖలో విస్తరిస్తుడటం.. తదుపరి ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ ను నేరుగా చూసే అవకాశం వైజాగ్ వాసులకు లభించనుండటంతో ఇన్ఆర్బిట్ మాల్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొననుంది. అయితే ఏఏఏ సినిమాస్ లాంచ్ అయిన తర్వాత అల్లు అర్జున్ స్టూడియోస్ విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో కూడా ఒక హై క్లాస్ స్టూడియోని అన్ని వసతులతో నిర్మించి విశాఖలో సినీపరిశ్రమ అభివృద్ధిలో భాగం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుందేమో!
