విశాఖ ఇనార్బిట్ మాల్‌లో AAA సినిమాస్ ప్రత్యేకతలు
కొద్దిరోజుల క్రితమే `దురంధర్ 2` సినిమాతో కోకాపేట ఏఏఏ సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్- అల్లు అర్జున్ బృందం సగర్వంగా ఈ థియేటర్లను లాంచ్ చేసారు.
By: Sivaji Kontham | 24 March 2026 11:39 PM ISTకొద్దిరోజుల క్రితమే `దురంధర్ 2` సినిమాతో కోకాపేట ఏఏఏ సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్- అల్లు అర్జున్ బృందం సగర్వంగా ఈ థియేటర్లను లాంచ్ చేసారు. ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ నగర వాసులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతలోనే బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ కి చెందిన కొత్త మల్టీప్లెక్స్ లాంచింగుకి రెడీ అవుతోంది. వందల కోట్ల బడ్జెట్లతో నిర్మిస్తున్న భారీ మాల్స్ లో ఏఏఏ సినిమాస్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
కేంద్ర మంత్రి శరభనంద సోనావాల్, అలాగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారా లోకేష్ నాయుడు సమక్షంలో ఇనార్బిట్ మాల్ ఈనెల 23న ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఇనార్బిట్ మాల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన AAA సినిమాస్ సరికొత్త వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించనుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మాల్ రెండవ అంతస్తులో ఈ మల్టీప్లెక్స్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ సినిమా థియేటర్లు విశాఖ వాసులకు, పర్యాటకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ గా మారనుంది.
ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 8 స్క్రీన్లు అందుబాటులో ఉండటం విశేషం. ఒకేసారి సుమారు 1600 మంది ప్రేక్షకులు సినిమాను వీక్షించేలా ఇక్కడ సీటింగ్ సామర్థ్యాన్ని రూపొందించారు. సాధారణ స్క్రీన్లతో పాటు సినిమా ప్రియుల కోసం ప్రత్యేకంగా ఒక వీఐపీ స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి? అంటే.. అత్యుత్తమ సౌండ్ సిస్టమ్, విజువల్ క్వాలిటీతో కూడిన ఈ థియేటర్లు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని మిగిలిస్తాయని చెబుతున్నారు.
ఇక ఇనార్బిట్ మాల్ విషయానికి వస్తే.. మొదటి దశలో సుమారు 600 కోట్ల భారీ పెట్టుబడితో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. రానున్న 16 నుంచి 18 నెలల్లో మరో 300 కోట్ల అదనపు పెట్టుబడితో రెండవ దశ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఈ మాల్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన సుమారు 300 పైగా బ్రాండ్లు తమ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇది నగరంలోనే అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్‌గా నిలవనుంది.
వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ మాల్ పెద్దపీట వేసింది. భవనం మధ్యలో ఉన్న 80 ఏళ్ల నాటి పురాతన వృక్షాన్ని నరికివేయకుండా.. దాని చుట్టూ భవనాన్ని నిర్మించి పర్యావరణంపై తమకున్న మక్కువను చాటుకున్నారు. భవనం లోపల కూడా చెట్లు ఉండటం వల్ల సహజమైన వాతావరణం నెలకొంటుంది. దీనివల్ల ఈ నిర్మాణానికి సస్టైనబిలిటీ పరంగా సర్టిఫికేషన్ లభించే అవకాశం ఉంది.
కేవలం షాపింగ్ - సినిమాలకే పరిమితం కాకుండా.. రిక్రియేషన్ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ఎకరం మేర గార్డెన్ స్పేస్‌ను కేటాయించారు. అలాగే టెర్రస్ పైన 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండోర్, అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి.. అద్భుతమైన ఆహార రుచులను ఆస్వాధించడానికి ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాట్లు ఉన్నాయి. ఇక సినిమాలు వినోదానికి నగరవాసుకు ఏఏఏ సినిమాస్ ఒక చక్కని వేదికగా నిలుస్తుంది.
