Begin typing your search above and press return to search.

ఒకే మూడ్.. ఒకే టెంప్లేట్.. బన్నీ సినిమాకు మొదట్లోనే ట్విస్ట్!

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ఏ పెద్ద సినిమా చూసినా ఒకే తరహా టెంప్లేట్, ఒకే మూడ్ కనిపిస్తోంది

By:  M Prashanth   |   14 Oct 2026 11:52 PM IST
ఒకే మూడ్.. ఒకే టెంప్లేట్.. బన్నీ సినిమాకు మొదట్లోనే ట్విస్ట్!
X

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ఏ పెద్ద సినిమా చూసినా ఒకే తరహా టెంప్లేట్, ఒకే మూడ్ కనిపిస్తోంది. హీరోలందరూ తెరపై సరికొత్తగా కనిపించాలని తాపత్రయపడుతున్నప్పటికీ.. చివరికి అందరూ ఒకే రకమైన డార్క్, రస్టిక్ ప్రపంచాల్లోకే అడుగుపెడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఏదో ఒక సినిమా క్లిక్ అవ్వగానే, మిగిలిన డైరెక్టర్లంతా తమ హీరోలను కూడా అదే మూస ధోరణిలోకి నెట్టేస్తున్నారనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని చేసిన 'ది ప్యారడైజ్', బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'పెద్ది' ప్రాజెక్టుల విషయంలో ఈ పోలికలు ఎక్కువగా వినిపించాయి. ఈ రెండు భారీ చిత్రాలు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ డ్రామాలే. అయితే స్క్రీన్ పై కనిపించే డార్క్ విజువల్స్ నుంచి హీరో ఎలివేషన్లు, హెవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూసి.. ఇవి రెండూ ఒకే ఫార్మాట్ లో అటు ఇటు తిప్పి తీసినట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

స్టార్టింగులో ఇలాంటి రస్టిక్ అవతారాలు, రక్తపాతం ఆడియన్స్ కు కాస్త థ్రిల్ ఇచ్చాయి. కానీ వరుసగా ప్రతి స్టార్ హీరో అదే మట్టి గెటప్, అదే గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో వస్తుంటే థియేటర్లలో ఫ్రెష్ నెస్ పూర్తిగా దెబ్బతింటోంది. సినిమా టైటిల్ మారినా చూసే విజువల్స్ లో తేడా లేకపోవడంతో ఆడియన్స్ లో క్రమంగా విసుగు మొదలవుతోంది. క్రియేటివిటీ అంటే స్క్రీన్ మొత్తం నలుపు, ఎరుపు రంగులతో నింపేయడం కాదనే విమర్శలు ఇండస్ట్రీ వర్గాల నుంచే వస్తున్నాయి.

ఈ రొటీన్ ఫార్ములా సెగ ఇప్పుడు అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ AA23 కు కూడా తగిలింది. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వగానే బన్నీ లుక్ కోసం ముంబైలో ప్రత్యేకంగా ఒక లుక్ టెస్ట్ వీడియోను షూట్ చేశారట. ఆ వీడియోతోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సరిగ్గా అదే టైమ్ లో మరో స్టార్ హీరో గ్యాంగ్ స్టర్ మూవీ నుంచి అచ్చం అలాంటి డార్క్ టోన్ తో ఉన్న ప్రమోషనల్ వీడియో బయటకు వచ్చింది.

వేరే సినిమా వీడియోతో తమ కాన్సెప్ట్ సింక్ అవుతుండటాన్ని గమనించిన AA23 టీమ్ వెంటనే అప్రమత్తమైంది. ఇప్పుడు తాము ఆ వీడియోను రిలీజ్ చేస్తే వేరే సినిమాను కాపీ కొట్టినట్లు ఉంటుందనే ఉద్దేశంతో, తమ పాత ప్రమోషనల్ ప్లాన్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తమ లుక్ టెస్ట్ ను మళ్లీ కొత్తగా ఎలా డిజైన్ చేయాలనే దానిపై లోకేష్ టీమ్ పునరాలోచనలో పడింది. ఒకే ట్రెండ్ ను అందరూ ఫాలో అవ్వడం వల్ల మొదట్లోనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

తెలుగు సినిమాకు అసలైన బలం వైవిధ్యమైన కథలను, లోతైన ఎమోషన్లను చూపించడమే. ఒక హీరోకు లేదా ఒక దర్శకుడికి వర్కౌట్ అయిన స్టైల్ ఇండస్ట్రీలో అందరికీ సెట్ అవుతుందనే గ్యారెంటీ ఉండదు. ప్రతి ప్రాజెక్ట్ కు ఒక విలక్షణమైన ఐడెంటిటీ ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. పాత సక్సెస్ ఫార్ములాలను జిరాక్స్ తీయడం మానేసి, రూట్ మార్చి కొత్త ఐడియాలతో వస్తేనే దర్శకులకు బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ ఉంటుంది.