Begin typing your search above and press return to search.

23 ఏళ్ల ప్రయాణంలో బ‌న్నీ సాధించిన అసలు సిసలు విజయం!

తాజాగా సొంత మ‌ల్టీప్లెక్స్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నానికి విచ్చేసిన అల్లు అర్జున్‌కు అభిమానులు ఊహకంద‌ని రీతిలో నీరాజనాలు పట్టారు.

By:  Srikanth Kontham   |   10 Aug 2026 1:23 PM IST
23 ఏళ్ల ప్రయాణంలో బ‌న్నీ సాధించిన అసలు సిసలు విజయం!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలుపెరుగని ప్రయాణంతో గడచిన రెండు దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా పరిచయమైన తొలి చిత్రం `గంగోత్రి` షూటింగ్ సమయంలో విశాఖపట్నంలో జరిగిన ఓ అరుదైన సంఘటన ఆయన ప్రయాణం ఎంతటి కఠినమైనదో తెలియజేస్తుంది. అప్పట్లో వైజాగ్ వీధుల్లో రోడ్డుపై తిరుగుతున్న అల్లు అర్జున్‌ను చూసి కనీసం ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉండేది. కానీ కాలం మారింది. బ‌న్నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నేడు అదే వైజాగ్ గడ్డపై ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ లేదు.

తాజాగా సొంత మ‌ల్టీప్లెక్స్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నానికి విచ్చేసిన అల్లు అర్జున్‌కు అభిమానులు ఊహకంద‌ని రీతిలో నీరాజనాలు పట్టారు. బ‌న్నీని ఒక్కసారి కళ్లారా చూసేందుకు, అభిమాన హీరోతో సెల్ఫీ దిగేందుకు వేలాది మంది జనం రోడ్లపైకి వచ్చి వెంట పడ్డారు. వైజాగ్ వీధులన్నీ అభిమానుల కోలాహలంతో, భారీ ర్యాలీలతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఒకప్పుడు ఎవరూ గుర్తించని సాధార‌ణ‌ నటుడిగా అడుగుపెట్టిన వ్యక్తి నేడు దేశవ్యాప్తంగా మారుమోగే రేంజ్‌కు ఎదిగారనడానికి నిన్నటి సంఘటనే తిరుగులేని సాక్ష్యం.

అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా 23 ఏళ్ళు పూర్తయింది. ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో బన్నీ పడిన కష్టం, నటనపై చూపిన అంకితభావం, ప్రతి సినిమాలోనూ తనను తాను కొత్తగా మలచుకున్న తీరు ఆయ‌న్ని నేడు పాన్-ఇండియా స్థాయికి చేర్చాయి. ప్రతీ సినిమాతో తన డ్యాన్స్, బాడీ లాంగ్వేజ్, డైరెక్షన్ సెన్స్, స్టైలిష్ మేకింగ్‌తో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో `పుష్ప` చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకునే స్థాయికి ఎదిగారు.

స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా? తనదైన సొంత ప్రతిభతో, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన చూపిన పట్టుదల యువ నటులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతీ చిత్రంలోనూ తన నటనను మెరుగుపరుచుకుంటూ, ప్రేక్షకులు కోరుకునే మాస్ -క్లాస్ అంశాలను సమపాళ్లలో అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బ‌న్నీ ఒక హీరోగా మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే గ్లోబల్ ఐకాన్‌గా రూపాంతరం చెందారు.

ఇటీవ‌లి వైజాగ్ పర్యటనలో ఆయనకు ఎదురైన అపూర్వ స్వాగతం, అభిమానుల సునామీ చూసి అల్లు అర్జున్ ప్రజల హృదయాల్లో ఎంతటి బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారో అర్ద‌మ‌వుతుంది. రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోని పరిస్థితి నుంచి.. ఏ గల్లీలో అడుగుపెట్టినా లక్షలాది మంది జనం జెండా ఊపుతూ స్వాగతం పలికే స్థాయికి బ‌న్నీ ఎదిగిన తీరు ఒక సినిమా కథనే తలపిస్తుంది. ఈ ప్రయాణం కేవలం అల్లు అర్జున్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిన అద్భుతమైన మైలురాయి.