Begin typing your search above and press return to search.

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా చోటుచేసుకున్న తరాల మార్పు గురించి తెలుసుకోవాల‌నే కుతూహాలం అభిమానుల‌కు ఉంటుంది.

By:  Sivaji Kontham   |   4 Nov 2026 6:44 PM IST
పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌
X

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా చోటుచేసుకున్న తరాల మార్పు గురించి తెలుసుకోవాల‌నే కుతూహాలం అభిమానుల‌కు ఉంటుంది. ఫ్యామిలీల్లో చిన్న‌పాటి షిఫ్టింగ్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెల్ల‌డించిన విష‌యాలు ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చనీయాంశమయ్యాయి. `సమ్మర్ హాలిడేస్` చిత్ర వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ``మా అమ్మమ్మది పాలకొల్లు, ఆ తర్వాత జెనరేషన్ అమ్మలంతా హైదరాబాద్ వచ్చేసారు. పాత తరం వాళ్లు తప్ప మిగిలిన వారంతా సిటీకి ఎగుమతి అయ్యారు`` అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఉన్న మూలాలు కాలక్రమేణా హైదరాబాద్‌కు ఎలా మారాయో ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం అల్లు కుటుంబానికే పరిమితం కాకుండా, కోస్తాంధ్ర -రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన మెజారిటీ సినీ కుటుంబాల వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన క్రమంలో నాటి తరం నటులు, నిర్మాతలు తమ వ్యాపారాలతో పాటు కుటుంబాలను కూడా భాగ్యనగరానికి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద్దలను సైతం నగరానికే రప్పించి.. ఇక్కడే నివాసాలను ఏర్పాటు చేసుకుని సెటిల‌య్యారు. చాలా సినీకుటుంబాల ఆస్తులు ఫిలింన‌గ‌ర్, జూబ్లీహిల్స్ స‌హా సిటీ ఔట‌ర్ లో ఉన్నాయి.

ఈ తరాల మార్పుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. చిరంజీవి గారి తల్లి అంజనా దేవి ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలోనే ఉంటున్నారు. మహా శివరాత్రి పూజలు, మదర్స్ డే వేడుకలు, పండుగలు.. పుట్టినరోజుల సందర్భంగా ఆమె చిరంజీవి, రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ తదితర కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే కనిపిస్తారు. అలాగే అక్కినేని కుటుంబం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా తమ ఆస్తులను, నివాసాలను హైదరాబాద్‌లోనే కేంద్రీకరించి పూర్తి స్థాయిలో ఇక్కడే స్థిరపడింది.

మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కుటుంబంలో కూడా ఇదే తరహా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ పూర్వీకుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అయినప్పటికీ కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజుల కాలంలోనే కుటుంబం చెన్నై మీదుగా హైదరాబాద్‌కు మారింది. ప్రభాస్ గ్రాండ్ మా సత్యవతి గారు సైతం గతంలో కుటుంబంతో పాటు హైదరాబాద్‌లోనే నివసించారు. ఊరిలో పాత ఇల్లు, కొంతమంది బంధువులు ఉన్నా కానీ.. ప్రధాన కుటుంబమంతా హైదరాబాద్‌కే పరిమితమైంది. పూర్తిగా హైద‌రాబాద్ లోనే సెటిలైన సినీకుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి.

మొత్తానికి గ్రామీణ నేపథ్యం, పల్లెటూరి వాతావరణం నుంచి న‌గ‌ర‌జీవనానికి సినీ కుటుంబాలు ఎప్పుడో షిఫ్ట‌య్యాయి. నేడు హైదరాబాద్ కేంద్రంగా సినీ కుటుంబాలు ఎలా విస్తరించాయో అల్లు అరవింద్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. పాత తరం వారు ఊళ్లలోనే ఉండిపోగా..తర్వాతి తరాలు వ్యాపార, సినీ అవకాశాల కోసం నగర బాట పట్టాయి. ఫలితంగా అమ్మమ్మలు, నానమ్మల నాటి పల్లెటూరి అనుబంధాలు నేడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సంస్కృతిలో కలిసిపోయాయి.