చిన్నారి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అరవింద్, స్నేహ
ఆపదలో ఉన్న ఒక కుటుంబానికి `మేమున్నాము` అనే భరోసానిచ్చినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది.
By: Sivaji Kontham | 6 May 2026 11:42 PM ISTఆపదలో ఉన్న ఒక కుటుంబానికి `మేమున్నాము` అనే భరోసానిచ్చినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. `పుష్ప 2: ది రూల్` ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయి.. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అల్లు కుటుంబం కొండంత అండగా నిలుస్తోంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్న చిన్నారి శ్రీతేజ్ దాదాపు 150 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ క్లిష్ట సమయంలో బాధ్యతాయుతమైన జెంటిల్‌మన్ లాగా అల్లు అరవింద్ ఆ కుటుంబాన్ని పరామర్శించి పెద్దరికాన్ని చాటుకుంటున్నారు.
కేవలం ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకోకుండా.. ఘటన జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా అల్లు అరవింద్ క్రమం తప్పకుండా పరామర్శిస్తుండటం విశేషం. తాజాగా అల్లు అరవింద్ .. ఆయన కోడలు.. అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి స్వయంగా శ్రీతేజ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. అక్కడ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా..శ్రీతేజ్ తండ్రి, సోదరితో కొంత సమయాన్ని గడిపారు. అల్లు కుటుంబం ఇలా నిరంతరం ఆ కుటుంబంతో టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లి రావడం వారి మానవత్వాన్ని చాటిచెబుతోంది.
శ్రీతేజ్ కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు భవిష్యత్తులోనూ వారికి ఎలాంటి అవసరం వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామనే భరోసాను అల్లు అరవింద్ ఈ పర్యటన ద్వారా ఇచ్చారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు స్పందించడం అందరూ చేసే పనే కానీ.. రెండేళ్ల తర్వాత కూడా ఆ బాధిత కుటుంబాన్ని విడవకుండా వెన్నంటి ఉండటం అల్లు అరవింద్ వంటి జెంటిల్మన్ కే చెల్లింది. శ్రీతేజ్ సోదరితో అరవింద్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడి.. ఆమెకు ధైర్యం చెప్పడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
ప్రస్తుతం అల్లు అరవింద్.. స్నేహా అర్జున్ నేరుగా చిన్నారి శ్రీతేజ్ ఇంటికి వెళ్లిన వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం చూపిస్తున్న ఈ నిరంతర ఆదరణ.. సంరక్షణ విషయంలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన హీరోయిజం ఉందని.. అల్లు కుటుంబం తమ ప్రవర్తనతో దానిని నిరూపించిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
