2 గంటలపాటు తీవ్ర భావోద్వేగంతో ఉండిపోయాం: అల్లు అరవింద్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 9 Sept 2025 4:06 PM ISTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) ఆగస్టు 30వ తేదీన తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తన ఇంట్లోనే కన్నుమూశారు.
దీంతో నిన్న అల్లు కుటుంబసభ్యులు కనకరత్నమ్మ పెద్దకర్మను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేటీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు.
అయితే ఆ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడారు. తన తల్లి గొప్పతనాన్ని వివరించారు. ఆ సమయంలో తన మాతృమూర్తి చనిపోయిన వెంటనే ఏం జరిగిందో వెల్లడించారు. కనకరత్నమ్మ మరణించిన విషయం తెలియగానే.. అంతా ఒక రెండు గంటల పాటు తీవ్ర భావోద్వేగంతో ఉండిపోయామని తెలిపారు.
"మా తల్లి గారు చనిపోయినప్పుడు మొదటి ఒక రెండు గంటలపాటు తీవ్ర ఉద్వేగంలో ఉండిపోయాం. నేను, నా కుటుంబ సభ్యులు, చెల్లెళ్లు అంతా భావోద్వేగమయ్యాం. అది ఎవరికీ తప్పదు. నా తల్లి మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయిందని బాధలో ఉండిపోయాం. కానీ కాసేపు తర్వాత ఆమె చివరి వీడ్కోలును, సంతోషంగా పైలోకానికి సాగనంపాలని అనుకున్నాం" అని తెలిపారు.
అల్లు అరవింద్ అన్నట్లే వారంతా కనకరత్నమ్మను సాగనంపారని చెప్పాలి. అయితే అల్లు రామలింగయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు అల్లు అరవింద్ కాగా.. కుమార్తెలు నవభారతి, వసంత లక్ష్మి, సురేఖ. అందులో పెద్ద కుమార్తె ఇప్పటికే మరణించారు. వసంత లక్ష్మి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇక సురేఖ మనందరికీ చిరంజీవి సతీమణిగా సుపరిచితురాలు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న మెగాస్టార్ కు ఇచ్చి సురేఖను అల్లు రామలింగయ్య పెళ్లి చేశారు. మెగా, అల్లు కుటుంబాలకు ఒకటి అయ్యేలా చేశారు. ఇప్పుడు రెండు కుటుంబాలకు చెందిన అనేక మంది సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కనకరత్నమ్మ మనవలు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రామ్ చరణ్, సుస్మిత టాలీవుడ్ లో రాణిస్తున్నారు.
