'నిర్మాత అల్లు అరవింద్' మిస్సింగ్
వెండితెరపై నిర్మాత అల్లు అరవింద్ అనే పేరు చూసి చాలా కాలమైంది. అయితే అల్లు అరవింద్ సినిమాలు చేయడం ఆపేశారని కాదు.
By: M Prashanth | 3 Sept 2026 12:52 PM ISTవెండితెరపై నిర్మాత అల్లు అరవింద్ అనే పేరు చూసి చాలా కాలమైంది. అయితే అల్లు అరవింద్ సినిమాలు చేయడం ఆపేశారని కాదు. పెట్టుబడులు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, గీతా గ్రూప్ నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒకప్పుడు పోస్టర్ మీద ‘గీతా ఆర్ట్స్’, నిర్మాత ‘అల్లు అరవింద్’ అన్న క్రెడిట్ కాంబినేషన్ ఇప్పుడు కనిపించడం లేదు.. వెండితెరపై ఆ పేరు మిస్సింగ్ లోనే ఉందన్నమాట. 2020లో ‘అల వైకుంఠపురములో’కు ఎస్. రాధాకృష్ణతో కలిసి నిర్మాతగా ఉన్న తర్వాత, పెద్ద తెలుగు సినిమాల్లో ఆయన ఎక్కువగా సమర్పకుడిగానే కనిపించారు.
ఇదే సమయంలో గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ తనదైన రూట్‌లో నడుస్తోంది. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు, కొత్త దర్శకులు, ఇతర బ్యానర్లతో భాగస్వామ్యాలు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బన్నీ వాసు కూడా ఆ సినిమాల్లో ముందుంటున్నారు. అంటే గీతా కుటుంబం నుంచి ప్రొడక్షన్ తగ్గలేదు. కానీ మెయిన్ ‘గీతా ఆర్ట్స్’ అనే పాత పెద్ద బ్రాండ్ మాత్రం వరుసగా సినిమాలు తీసే స్థాయిలో కనిపించడం లేదు.
‘తండేల్’ డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైనే వచ్చింది. కానీ అక్కడ నిర్మాతగా బన్నీ వాసు ఉండగా, అల్లు అరవింద్ సమర్పించారు. సినిమా మంచి విజయం సాధించింది. ‘నిర్మాత అల్లు అరవింద్’ అనే క్రెడిట్ మాత్రం అక్కడ కూడా రాలేదు. ఒకప్పుడు చిరంజీవి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ వరకు పెద్ద సినిమాలకు స్వయంగా నిర్మాతగా ముందుండిన అరవింద్ ఇప్పుడు ఎక్కువగా వెనక నుంచి లెక్కలు చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్లు ఒకేసారి చాలా సినిమాలు లైన్లో పెడుతున్నాయి. పెద్ద హీరో సినిమా ఒకటి సెట్స్‌పై ఉండగానే మరో రెండు మూడు ప్రాజెక్టులు ప్రకటిస్తున్నాయి. అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాతలు మాత్రం బడ్జెట్, మార్కెట్, రికవరీ విషయంలో ఎక్కువ లెక్కలు చూసుకుని ముందుకెళ్తారనే మాట ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. ఇప్పటి భారీ బడ్జెట్ల కాలంలో ఆ జాగ్రత్త మరింత కనిపిస్తోంది.
కానీ ఇప్పుడు గీతా ఆర్ట్స్ దగ్గర మళ్లీ పెద్ద లైనప్ తయారవుతోంది. అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే ప్లాన్‌లో ఉంది. నాగచైతన్య, క్లాక్స్ సినిమాకు గీతా భాగస్వామ్యం ఉండనుంది. రష్మికతో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్, అఖిల్‌తో మరో ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ను కూడా స్వప్న సినిమాతో కలిసి నిర్మిస్తున్నారు.
ఇందులో బన్నీ సినిమా దగ్గర మాత్రం పాత గీతా ఫీల్ తిరిగి రావచ్చు. అల్లు అర్జున్ ఇప్పుడు ఉన్న మార్కెట్‌కు తగ్గట్టు అది భారీ ప్రాజెక్ట్ అవుతుంది. బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ కూడా కొత్తదే. ఈ సినిమాకు అల్లు అరవింద్ స్వయంగా నిర్మాతగా ముందుకొస్తే, చాలా రోజుల తర్వాత టైటిల్ కార్డుపై ఆ పాత పేరు మళ్లీ కనిపిస్తుంది.
