400 కోట్లు పెట్టి ఎందుకు తీయట్లేదు? అల్లు అరవింద్ లాజిక్ మామూలుగా లేదు!
"గీతా ఆర్ట్స్".. యాభై ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. ఎన్నో బ్లాక్‌బస్టర్లు, ఎందరో స్టార్లను పరిచయం చేసిన ఘనత ఈ సంస్థది.
By: M Prashanth | 5 Nov 2025 6:28 PM IST"గీతా ఆర్ట్స్".. యాభై ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. ఎన్నో బ్లాక్‌బస్టర్లు, ఎందరో స్టార్లను పరిచయం చేసిన ఘనత ఈ సంస్థది. అయితే, గత కొంతకాలంగా ఈ బ్యానర్ స్పీడ్ తగ్గించిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా, జూనియర్ నిర్మాతలు సైతం 400, 500 కోట్లతో పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే, అల్లు అరవింద్ మాత్రం కేవలం "ప్రెజెంటర్"గా ఉంటున్నారు, పెద్ద రిస్కులు తీసుకోవడం లేదనే టాక్ ఉంది. 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రెస్ మీట్‌లో సరిగ్గా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది.
"మీరు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారా?" అని ఒక రిపోర్టర్ సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ ఏమాత్రం తొణకకుండా, తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. ముందుగా "రిస్క్" అనే పదానికే కొత్త నిర్వచనం చెప్పారు. "మీరు ఫైనాన్షియల్‌గానే మాట్లాడితే, నేను ఈ 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమానే రిస్క్‌గా ఫీల్ అవుతున్నా. ప్రతీ సినిమా ప్రతీ నిర్మాతకు రిస్కే. వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్లకు కూడా ఫస్ట్ షో పడేదాకా లోపల దడ ఉంటుంది" అంటూ అసలు గ్యారెంటీ అనేదే ఇండస్ట్రీలో ఉండదని క్లారిటీ ఇచ్చారు.
ఆ తర్వాత అసలు ప్రశ్నకు వస్తూ, "400-500 కోట్లు పెట్టి నేనెందుకు సినిమా తీయట్లేదు అనే కదా మీ ప్రశ్న?" అని రిపోర్టర్‌నే ఎదురు ప్రశ్నించారు. "నేను ఆ రేంజ్ బడ్జెట్ పెట్టాలంటే అల్లు అర్జున్‌తోనో, రామ్ చరణ్‌తోనో తీయాలి" అంటూ అసలు పాయింట్‌కు వచ్చారు.
ఇక్కడే అల్లు అరవింద్ తన బిజినెస్ మైండ్‌ను బయటపెట్టారు. "నేను వాళ్లతో సినిమా తీసి రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఆ డబ్బులు మా ఇంటికే వస్తాయి. అదే బయట నిర్మాతలు సినిమా తీసి రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఆ డబ్బులు కూడా మా ఇంటికే వస్తాయి" అని అన్నారు.
"నాది నేను ఇచ్చుకోవడం కన్నా, బయటి వాళ్లు మన ఇంటికి డబ్బులు తెచ్చి ఇస్తే ఇంకా మంచిది కదా?" అంటూ చమత్కరించారు. ఈ ఒక్క మాటతో అక్కడ నవ్వులు విరిశాయి. 400 కోట్లు పెట్టి, ఏళ్ల తరబడి కష్టపడి, రిస్క్ తీసుకునే బదులు, తన ఇంట్లోని స్టార్ హీరోలతో బయట నిర్మాతలు సినిమాలు తీసినా, ఆ లాభం తనకే వస్తుందనే లాజిక్‌ను ఆయన సింపుల్‌గా చెప్పేశారు.
ఈ సమాధానం, అల్లు అరవింద్‌ను ఎందుకు "మాస్టర్ మైండ్ ప్రొడ్యూసర్" అంటారో మరోసారి నిరూపించింది. ఆయన రిస్క్‌కు భయపడటం లేదు, కేవలం స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు తన ఇంట్లోనే ఉన్నప్పుడు, ఆయన నేరుగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముందనేది ఆయన పాయింట్. ఈ బిజినెస్ స్ట్రాటజీ చూశాక, ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ గేమ్‌లో ఎందుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
