'ధురంధర్' తెలుగు రైట్స్ ఎవరికి? అల్లు బాస్ దిగారా?
మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించిన ధురంధర్.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
By: M Prashanth | 14 Dec 2025 9:58 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన మాస్ యాక్షన్ డ్రామా ధురంధర్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. డిసెంబర్ 5వ తేదీన మూవీ రిలీజ్ అవ్వగా.. ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్స్ ను సాధిస్తోంది.
మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించిన ధురంధర్.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. 2025 బాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచేలా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో కొత్త టాక్ వినిపిస్తోంది. ధురందర్ మూవీ తెలుగులో కూడా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.
హిందీలో భారీ విజయం సాధించిన సినిమాను.. ఇప్పుడు తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో రణవీర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో త్వరలో విడుదల చేస్తారని సమాచారం. తెలుగు స్టైల్ కు తగ్గట్టు డబ్బింగ్ ను చేపడుతున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి.
అయితే డిసెంబర్ 19వ తేదీ.. ధురంధర్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కు సరైన డేట్ అని అనేక మంది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 25వ తేదీన పలు సినిమాలు విడుదలవుతుండటంతో.. ముందు వారం విడుదల చేస్తే బెటర్ అని అంటున్నారు. అప్పటి లోపల మేకర్స్.. పనులు కంప్లీట్ చేస్తారో లేదో మరి.
అదే సమయంలో తెలుగులో ఇప్పుడు ఎవరు రిలీజ్ చేస్తారన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ వెర్షన్ మూవీ రైట్స్ కు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. గట్టి పోటీ నెలకొన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే అల్లు బాస్.. రీసెంట్ గా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఛావాను విడుదల చేసిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ వచ్చిన కొన్ని రోజులకు తెలుగులో రిలీజ్ అయిన ఆ సినిమా.. భారీ వసూళ్లు సాధించింది. రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ లాభాలు అందించింది. దీంతో ఇప్పుడు ధురంధర్ ను ఆయనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంత ఉందో తెలియాలంటే వేచి చూడాలి.
