హై-వోల్టేజ్ సినిమాలపై ప్రేక్షకుల్లో విసుగు!
పాన్ ఇండియా సినిమాలపై ప్రేక్షకుల్లో కొంత విసుగు పెరిగి, ఫ్రెష్ కథలపై ఆసక్తి చూపుతున్నారన్న చర్చకు అల్లు అరవింద్ స్పందించారు. రెండేళ్ల క్రితమే మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేశానని, అయితే కమర్షియల్ సినిమాల ఆదరణ తగ్గుతుందని భావించలేదని స్పష్టం చేశారు. 2027, 2028లో భారీ తారాగణంతో బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
By: Srikanth Kontham | 27 Nov 2026 1:27 PM ISTభారీ బడ్జెట్లు.. అట్టహాసమైన యాక్షన్ సన్నివేశాలు.. పాన్ ఇండియా హంగామా అన్నది కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమను నడిపించిన ఫార్ములా ఇది. కానీ ఇటీవల ఆడియన్స్ పల్స్‌లో చిన్నపాటి మార్పు కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. హడావుడిగా సాగే హై-వోల్టేజ్ సినిమాల కంటే మనసుకు హాయినిచ్చే క్లాసీ.. ప్లెజెంట్ కథల వైపు జనం చూస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..
అగ్ర హీరోలంతా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్న వేళ ఏడాదిన్నరగా ప్రేక్షకులు అలాంటి సినిమాల పట్ల కొంత విసుగు చెందుతున్నారని..ఫ్రెష్‌గా ఉండే కథలను ఇష్టపడుతున్నారని ఓ విలేకరి ప్రస్తావించారు. అలాంటి సినిమాల కోసం దుల్కర్ సల్మాన్ లాంటి ఇతర భాషా నటుల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దానికి అల్లు అరవింద్ నవ్వుతూనే సమాధానం ఇచ్చారు.
మంచి వ్యాపారవేత్త ఎవరైనా రెండు మూడేళ్ల తర్వాత మార్కెట్ ఎలా మారబోతుందో ముందే అంచనా వేయగలరని.. తాను కూడా రెండేళ్ల క్రితమే ఈ ట్రెండ్‌ను ఊహించాననన్నారు. మరి ఈ విషయాన్ని మీ తనయుడు అల్లు అర్జున్‌కు కూడా చెప్పారా? అని విలేకరి అడగ్గా ప్రశ్నను మరోసారి రిపీట్ చేయించుకుని నవ్వుతూ అంత ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు అని బదులిచ్చారు. అయితే ఈ మాటలు ఆధారంగా వేరే అర్థాలు తీయొద్దని అరవింద్ స్పష్టం చేశారు.
కమర్షియల్ సినిమాల ఆదరణ పూర్తిగా పడిపోతుందని రెండేళ్ల క్రితం తాను ఊహించలేదని.. కమర్షియల్ ప్రాజెక్టులు తీసే ప్రయత్నం తాను కూడా చేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో తన సినిమాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేకపోయినా? 2027, 2028 నాటికి భారీ తారాగణంతో బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మిస్తానని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాణం విషయంలో అరవింద్ ఎంత జాగ్రత్తగా ఉంటారు? అన్నది తెలిసిందే. సుదీర్ఘ అనుభవంతో కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. రొటీన్ కథల కంటే ఎలాంటి కథ మార్కెట్ కి ఎక్కుతుంది? అన్నది పక్కాగా అంచనా వేయగలరు. అలాగే ప్రయోగాల విషయంలో అరవింద్ వెనక్కి తగ్గేవారు కాదు. కథ నచ్చితే రాజీ పడకుండా ఖర్చు చేస్తారు. ప్రస్తుతం అరవింద్ ..నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ `ఎం.ఎస్ - ఎ లెగసీ ఆన్ స్క్రీన్` ని మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
