Begin typing your search above and press return to search.

"నాకో స్థాయి ఉంది": బండ్ల కామెంట్స్‌పై అల్లు అరవింద్ ఫైనల్ పంచ్!

టాలీవుడ్‌లో బండ్ల గణేష్ మైక్ పట్టుకున్నారంటే, ఆ స్పీచ్ ఎక్కడ ఆగుతుందో, ఎవరి మీదకు వెళ్తుందో అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది

By:  M Prashanth   |   5 Nov 2025 6:27 PM IST
నాకో స్థాయి ఉంది: బండ్ల కామెంట్స్‌పై అల్లు అరవింద్ ఫైనల్ పంచ్!
X

టాలీవుడ్‌లో బండ్ల గణేష్ మైక్ పట్టుకున్నారంటే, ఆ స్పీచ్ ఎక్కడ ఆగుతుందో, ఎవరి మీదకు వెళ్తుందో అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆయన మాటలు కొన్నిసార్లు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తే, మరికొన్నిసార్లు ఇండస్ట్రీ పెద్దల మధ్య సున్నితమైన చర్చలకు దారితీస్తాయి. ఆయన తన స్పీచ్‌లలో ఎంత ఎమోషనల్‌గా మాట్లాడతారో అందరికీ తెలిసిందే.

ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో, బండ్ల గణేష్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ను ఉద్దేశిస్తూ కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా, సినిమాల క్రెడిట్ విషయంలో, "చివరి నిమిషంలో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు" అంటూ బండ్ల చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఆ మాటలు అల్లు అరవింద్‌ను బాగా హర్ట్ చేశాయని కూడా ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

అయితే, ఇన్నాళ్లకు ఈ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ గా 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న అల్లు అరవింద్‌కు, ఒక రిపోర్టర్ నుంచి సూటి ప్రశ్న ఎదురైంది. "బండ్ల గణేష్ అన్న మాటలకు మీరు బాగా హర్ట్ అయ్యారట కదా? లాస్ట్ మినిట్‌లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారన్న కామెంట్స్‌పై మీరేమంటారు?" అని రిపోర్టర్ ప్రశ్నించారు.

ఈ ఊహించని ప్రశ్నకు, అల్లు అరవింద్ ఏమాత్రం తొణకలేదు, కోప్పడలేదు. చాలా ప్రశాంతంగా, ఒక్క ముక్కలో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఆయన మైక్ అందుకుని, "నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు ఓ స్థాయి ఉంది. అందుకే చెప్పట్లేదు" అని అన్నారు. ఈ ఒక్క డైలాగ్‌తో, ఆయన ఆ వివాదంపై స్పందించే ఇంట్రెస్ట్ తనకు లేదని, ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నానని చెప్పకనే చెప్పారు.

అరవింద్ ఇచ్చిన ఈ షార్ప్ అండ్ క్లాస్ రిప్లైకి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా చప్పట్లతో మద్దతు తెలిపారు. బండ్ల గణేష్ ఆవేశపూరితమైన కామెంట్స్‌కు, అల్లు అరవింద్ తన హోదాను, అనుభవాన్ని గుర్తుచేస్తూ ఎంతో హుందాగా సమాధానం ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. అనవసరమైన కాంట్రవర్సీకి మళ్లీ ఆజ్యం పోయకుండా, తన "స్థాయి" ఏంటో ఒక్క మాటతో చెప్పి ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ కామెంట్స్‌పై అరవింద్ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. ఇప్పుడు కూడా, ఆ టాపిక్‌ను సున్నితంగా పక్కన పెడుతూ, తన స్థాయిని గుర్తుచేయడం ద్వారా, ఈ వివాదానికి తన వైపు నుంచి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.