అల్లరోడి సినిమాకు లైన్ క్లియర్
కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అల్లరి నరేష్ కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక షెడ్యూల్ ప్రకారం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Garuda Media | 2 Sept 2026 6:54 PM ISTకొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అల్లరి నరేష్ కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక షెడ్యూల్ ప్రకారం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. సెన్సార్ బోర్డు రంభ ఊర్వశి మేనక మూవీకి యు-ఎ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ మధ్య చిన్న సినిమాలకు సెన్సార్ బోర్డు దగ్గర చివరి నిమిషంలో బ్రేకులు పడుతున్న సంగతి తెలిసిందే.
టైటిళ్లు మార్చమనడం సహా విచిత్రమైన కారణాలతో సినిమాలకు బ్రేకులు వేస్తున్నారు సెన్సార్ అధికారులు. అల్లరోడి సినిమాలో దేవతలైన రంభ, ఊర్వశి, మేనకలను చీరల్లో కాకుండా.. సెక్సీగా అనిపించే మోడర్న్ డ్రెస్సుల్లో చూపించడం పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టిందని.. దీంతో ఈ సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడిందని మూడు రోజుల ముందు వార్తలు వచ్చాయి.
దీంతో సెన్సార్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ ప్రొడ్యూస్ చేసిన సినిమాకు కూడా ఇలాంటి కష్టాలేంటో అనే చర్చ జరిగింది. ఐతే టీం ఏం కరెక్షన్లు చేసిందో ఏమో గానీ.. మంగళవారం ఈ సినిమాకు సెన్సార్ పూర్తయి, సర్టిఫికెట్ వచ్చేసింది. దీంతో ఈ వారం రంభ ఊర్వశి మేనక రిలీజ్ కాదేమో అన్న అనుమానాలు తొలగిపోయాయి. శుక్రవారం సినిమా యధావిధిగా విడుదల కానుంది. ఐతే సెన్సార్ బోర్డు దగ్గర బ్రేక్ పడడంతో గత రెండు మూడు రోజులు టీం ప్రమోషన్లు ఆపేసింది.
ఇక చివరి రెండు రోజులు ప్రమోషన్లను హోరెత్తించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆల్రెడీ అల్లరి నరేష్ రంగంలోకి దిగేశాడు. హీరో నాగచైతన్యతో కలిసి అతను ఒక ఫన్నీ వీడియో కూడా చేశాడు. చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరోడి సరసన సురభి నటించింది. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. ఓవైపు ఇరుముడి ఇరగాడేస్తుండగా.. ఈ వారం రోమాంచకం, ఐమ్ గేమ్ లాంటి చిత్రాల నుంచి పోటీ ఉండడంతో అల్లరోడి సినిమా నిలబడాలంటే మంచి టాక్ రావాల్సిందే.
