Begin typing your search above and press return to search.

ఏడాది గ్యాప్‌ ఇచ్చి మరీ డబుల్‌...!

అల్లరి నరేష్‌ ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సొంతం చేసుకుని, ఆయన సినిమాలో మినిమం ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుందని ప్రేక్షకుల్లో, ఆయనతో సినిమాను నిర్మిస్తే మినిమం వసూళ్లు వస్తాయని నిర్మాతల్లో నమ్మకం కలిగించాడు.

By:  Ramesh Palla   |   28 Oct 2025 9:00 PM IST
ఏడాది గ్యాప్‌ ఇచ్చి మరీ డబుల్‌...!
X

అల్లరి నరేష్‌ ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సొంతం చేసుకుని, ఆయన సినిమాలో మినిమం ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుందని ప్రేక్షకుల్లో, ఆయనతో సినిమాను నిర్మిస్తే మినిమం వసూళ్లు వస్తాయని నిర్మాతల్లో నమ్మకం కలిగించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కామెడీ సినిమా చేస్తే చూస్తారా... సీరియస్ కథలు ఎంపిక చేసుకుంటే ఆధరిస్తారా తెలియక అల్లరి నరేష్‌ జుట్టు పీక్కుంటున్నట్లుగా ఉన్నాడు. ఆయన నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాది అయింది. గత ఏడాదిలో కామెడీ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' తో పాటు సీరియస్ మూవీ 'బచ్చల మల్లి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాకు రొటీన్ కామెడీ అంటూ ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురైంది. ఇక బచ్చల మల్లి సినిమాను మరీ ఇంత సీరియస్‌గా అల్లరి నరేష్‌ ను చూడలేక పోతున్నామని అన్నారు. మొత్తానికి గత ఏడాది అల్లరోడికి బ్యాడ్‌ టైం కొనసాగింది.

అల్లరి నరేష్‌ 12A రైల్వే కాలనీ మూవీ...

గత ఏడాది చివర్లో వచ్చిన బచ్చల మలి సినిమా ఫలితంతో అల్లరి నరేష్ ఆలోచనలో పడ్డట్లుగా అనిపించింది. దాదాపు ఏడాది అవుతున్న ఇప్పటి వరకు కొత్త సినిమా విడుదల లేకపోవడంతో ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు బచ్చల మల్లి సినిమా తర్వాత అల్లరోడి నుంచి రాబోతున్న సినిమాపై క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న 12A రైల్వే కాలనీ సినిమా యూనిట్‌ సభ్యుల నుంచి ప్రకటన వచ్చింది. అది కూడా డైరెక్ట్‌ రిలీజ్ డేట్‌ను అల్లరి నరేష్ అండ్‌ టీం ఇచ్చేశారు. అది కూడా ఎప్పుడో, వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ ఏడాది నవంబర్ 21న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అనిల్‌ విశ్వనాథ్‌ అందించిన ఈ విభిన్నమైన థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ మూవీలో అల్లరి నరేష్ పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

ఆల్కహాల్‌ మూవీతో అల్లరి నరేష్‌..

12A రైల్వే కాలనీ సినిమా విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ ను వచ్చే వారం నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2025లో అల్లరి నరేష్ సినిమా రాలేదు అనే భావన లేకుండా చివర్లో అల్లరోడు తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 12A రైల్వే కాలనీ సినిమా విడుదలైన రెండు నెలల లోపే అల్లరి నరేష్‌ తన కామెడీ మూవీ ఆల్కహాల్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కొత్త సంవత్సరం కానుకగా 2026, జనవరి 1న ఆల్కహాల్‌ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత నాగ వంశీ ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేశాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

2026 సంక్రాంతికి ముందు సినిమాలు

ప్రస్తుతం అల్లరి నరేష్ చేస్తున్న రెండు సినిమాల్లో ఒకటి థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన సినిమా కాగా, మరోటి పూర్తి ఎంటర్‌టైన్మెంట్‌ మూవీ కావడం విశేషం. దాదాపు ఏడాది గ్యాప్‌ ఇచ్చిన అల్లరి నరేష్ కాస్త ఆలస్యం అయినా సాలిడ్‌ సబ్జెక్ట్‌ మూవీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈసారి అల్లరోడు ఖచ్చితంగా ఒక మంచి సినిమాను తన అభిమానులకు, ప్రేక్షకులకు ఇవ్వడం ఖాయం అనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు సైతం వ్యక్తం చేస్తున్నారు. అల్లరి నరేష్ నుంచి ఆశిస్తున్న కామెడీని, ఆయన మార్క్‌ వినోదాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఆల్కహాల్‌ ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ రెండు సినిమాలతో డబుల్‌ ట్రీట్‌ను తన ఫ్యాన్స్‌కు అందించబోతున్న అల్లరి నరేష్‌ 2026 ను సాలిడ్‌గా ప్రారంభిస్తాడా అనేది చూడాలి.