ఒక్క ఆలోచన.. వందల కోట్ల వసూళ్లు: 'బడ్జెట్' కాదు 'ఐడియా'నే 'శిఖరం'!
ఇదే వేదికపై ప్రస్తుతం సినీ పరిశ్రమను ఉత్కంఠకు గురిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత గురించి కూడా ఆయన మాట్లాడారు.
By: Sivaji Kontham | 22 Jun 2026 10:00 PM ISTసినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించడానికి వందల కోట్ల బడ్జెట్, భారీ తారాగణం మాత్రమే అవసరం లేదని కాలం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఇటీవల కేవలం 7 కోట్ల రూపాయల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రం `అబ్సెషన్` భారతదేశం నుంచే ఏకంగా 60 కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల నికర వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రాంతీయ సినిమాల విషయానికి వస్తే... మరాఠీలో వచ్చిన `సైరాఠ్` మూవీని కేవలం 4 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. అది ఏకంగా 110 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందే మైక్రో-బడ్జెట్ సినిమాల్లో కొంత రిస్కు ఉన్నా.. కంటెంట్ క్లిక్ అయితే మాత్రం అవి అందించే పెట్టుబడిపై రాబడి(ఆర్.వో.ఐ) ఊహకందని స్థాయిలో ఉంటుంది. ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. 2013లో 22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన `ది లంచ్‌బాక్స్` ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి గ్లోబల్ ఫెనామినన్‌గా మారింది. అలాగే 2012లో విద్యాబాలన్ నటించిన `కహానీ` చిత్రం కేవలం 8 కోట్ల బడ్జెట్‌తో రూపొంది 104 కోట్ల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు సాధించింది. 2007లో కేవలం 60 లక్షల రూపాయలతో తీసిన `భేజా ఫ్రై` ఏకంగా 18 కోట్లు వసూలు చేసి, బడ్జెట్ కంటే 30 రెట్లు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన బెంచ్‌మార్క్ చిత్రంగా నిలిచింది. టాలీవుడ్‌లో డెబ్యూ డైరెక్టర్ వేణు యెల్దండి కేవలం 1.5 కోట్ల నుండి 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన `బలగం` చిత్రం 26 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రాల విజయాలన్నీ బడ్జెట్‌లతో కాదు.. కేవలం `ఒక్క ఐడియా` .. దర్శకుడి అద్భుతమైన విజన్ వల్లే సాధ్యమయ్యాయి. డబ్బు కంటే ఐడియానే అత్యంత శక్తివంతమైనదని... అదే సినిమాను నడిపించే శిఖరం లాంటిదని రుజువైంది. తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ సీనియర్ దర్శకులు, నిర్మాత అల్లాణి శ్రీధర్ ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సమావేశంలో ముచ్చటించడం ఆసక్తిని కలిగించింది. మారుతున్న సాంకేతికత, సరికొత్త ఐడియాల గురించి ఆయన షేర్ చేసిన అనుభవాలు ఔత్సాహిక ఫిలింమేకర్స్‌ని ఎంతగానో ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకుల ఆలోచనా విధానం, సినిమా చూసే శైలి పూర్తిగా మారిపోయాయని అల్లాణి శ్రీధర్ విశ్లేషించారు. ప్రస్తుతం `బలగం` వంటి బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకాదరణ లభిస్తోందని, ప్రేక్షకుల మారుతున్న అభిరుచులను తెలుసుకుని సినిమాలు తీయాలని ఆయన సూచించారు. ``ఇప్పుడు సినిమా అనేది ఒక పెద్ద విప్లవంలా మారిపోయింది. మాధ్యమాలు విస్తరించాయి కాబట్టి... ఫిల్మీ కుటుంబం లేదా డబ్బు కంటే కూడా ఐడియాకే ఎక్కువ శక్తి ఉంది. ఐడియా అనేది శిఖరం లాంటిది`` అని ఆయన అభివర్ణించారు.
ఇదే వేదికపై ప్రస్తుతం సినీ పరిశ్రమను ఉత్కంఠకు గురిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏఐ అనేది సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌ని అంతం చేస్తుందని చాలామంది భయపడుతున్నారని... కానీ అది క్రాఫ్ట్స్‌ను చంపడం లేదు సరేకదా.. మన వేగాన్ని మరింత పెంచుతుందని స్పష్టం చేశారు. ఏఐ మన ఐడియాలను మరింత రిఫైన్ చేసి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిస్తుందని... పరిశ్రమలో ఏఐ స్టూడియోలు రాకతో టెక్నీషియన్స్ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారే తప్ప ఉద్యోగాలు పోవని భరోసా ఇచ్చారు. ఏఐ కూడా ఒక సాధనం లాంటిదేనని... అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెడితే మన అద్భుతమైన ఊహలను నిజం చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అల్లాణి విశ్లేషించారు.
తెలుగు సినిమా రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న అల్లాణి శ్రీధర్ 1988లో వచ్చిన `కొమరంభీమ్` చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా .. ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ విధివిధానాల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 24 జూన్ 2026న అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన `మీట్ ది ప్రెస్` కార్యక్రమంలో ఆయన సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఇకపై సినీపరిశ్రమ సీనియర్ దర్శకులు, నిర్మాతలను గౌరవిస్తూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఈ కార్యక్రమంలో తెలిపారు.
