గాయనిని అలా అవమానించిన అగ్ర నిర్మాణ సంస్థ
2005లో విడుదలైన బంటీ ఔర్ బబ్లిలో ''కజ్రారే..'' పాట ఎంతటి ఊపు ఊపిందో తెలిసిందే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ పాట అందరి మనసులను గెలుచుకుంది.
By: Sivaji Kontham | 8 Oct 2025 6:00 AM IST2005లో విడుదలైన బంటీ ఔర్ బబ్లిలో ''కజ్రారే..'' పాట ఎంతటి ఊపు ఊపిందో తెలిసిందే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ పాట అందరి మనసులను గెలుచుకుంది. అమితాబ్, రాణీముఖర్జీ, అభిషేక్, ఐశ్వర్య లాంటి టాప్ స్టార్లు ఈ పాటలో నర్తించారు. సాంగ్ అంత పెద్ద హిట్టవ్వడంలో గాయని అలీషా చినై అద్భుతమైన గొంతు కూడా ఒక కారణం.
ఈ పాటకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అలీసా చినై గెలుచుకుంది. నేటికీ ఈ పాటను పెళ్లి వేడుకలు, పార్టీలలో ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఆ పాట కిక్కు వెనుక ఒక అసహ్యకరమైన నిజం ఉంది. ఈ పాట పాడినందుకు తనకు రూ. 15,000 పారితోషికం ఇచ్చారని అలీషా వెల్లడించారు. దీనిని అవమానకరంగా భావించి ఆ డబ్బును తీసుకోలేదని తెలిపారు.
కజ్రారే తర్వాత నేను పాడాలనుకోలేదు. నాకు నిజంగా కోపం పెరిగింది. చాలా బాధపడ్డాను. గాయకులకు నిజంగా విలువ లేదా?'' అనిపించింది. అప్పటికే `మేడ్ ఇన్ ఇండియా` లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్ తో నేను గొప్ప స్థానంలో ఉన్నాను. నాకు నిజంగా పాడాలని అనిపించలేదు! అని అలీషా వ్యాఖ్యానించారు. శంకర్ ఎహ్సాన్ లాయ్ ఫోన్ చేసి అడగడంతో .. యష్ రాజ్ బ్యానర్ కాబట్టి అవునని చెప్పాను. కానీ చెక్ వచ్చినప్పుడు తిరస్కరించారు. వారు మళ్లీ మళ్లీ పంపుతూనే ఉన్నారు. కానీ నిరాకరించాను.. అని నాటి సంఘటనను అలీషా గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో జరిగిన విషయాన్ని బహిరంగంగా వ్యాఖ్యానించడం యష్ రాజ్ బ్యానర్ కి నచ్చలేదు. దానిని పెద్దది చేసారు. నేటి రోజుల్లో చాలా మంది గాయకులకు జీతం కూడా లభించదు.. ఎందుకంటే గాయకులు స్థాయి తగ్గించుకుని పాడుతున్నారు. పరిశ్రమ గాయకులకు మేలు చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది.. కానీ నిజానికి అది జరగదు! అని కూడా అలీషా ఇండస్ట్రీలో చీకటి వ్యవహారాన్ని బయటపెట్టారు.
'కజ్రా రే' పాటను విదేశాల్లో ప్రదర్శించినప్పుడల్లా యష్ రాజ్ ఫిలింస్ రాయల్టీలు వసూలు చేస్తోందని తెలుసుకుని తాను దిగ్భ్రాంతి చెందానని వెల్లడించింది. నిర్మాణ సంస్థకు భారీ రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ఆ ట్రాక్‌ను పాడవద్దని ఒక అంతర్జాతీయ నిర్వాహకుడు తనను కోరినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈ అనుభవంతో అలీషా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాపీరైట్ చట్టాలు మారే వరకు తాను బాలీవుడ్‌లో పాడనని అలీషా చినాయ్ ప్రకటించారు.
