Begin typing your search above and press return to search.

ఇండియ‌న్ స్కార్లెట్ జాన్స‌న్ స్టంట్స్ అద‌ర‌హో!

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర కేవలం ఒక రెగ్యులర్ స్టంట్ ఉమెన్‌గా మాత్రమే కాకుండా.. హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని పాపుల‌ర్ పాత్ర బ్లాక్ విడో-స్కార్లెట్ జహాన్సన్ తరహాలో భారీ సాహస విన్యాసాలతో రక్తి కట్టించనుంది.

By:  Sivaji Kontham   |   27 May 2026 8:15 AM IST
ఇండియ‌న్ స్కార్లెట్ జాన్స‌న్ స్టంట్స్ అద‌ర‌హో!
X

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆస్కార్ విన్నింగ్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో సాంప్రదాయబద్ధమైన సీతమ్మ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఆలియా భట్. రాజీ, బ్రహ్మాస్త్ర వంటి ఎన్నో క్రేజీ సినిమాలు చేసినా.. ఆర్ఆర్ఆర్ ఆలియా కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ (వై.ఆర్‌.ఎఫ్‌) ఆలియా భట్‌తో ఒక భారీ సాహసయాత్రను ప్రారంభించింది. ఒక మహిళా నటీమణిని ప్రధాన పాత్రధారిగా ఎంచుకుని వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక భారీ మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని పట్టాలెక్కించింది.

శివ్ రావాలి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండ‌గా ఆలియా, శార్వరి లీడ్ పాత్ర‌లు పోషిస్తున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రం కొన్ని వాయిదాల పర్వంతో డిలే అయినా.. ప్రస్తుతం 10 జూలై 2026న రిలీజ్ ల‌క్ష్యంగా అన్ని ప‌నుల్ని పూర్తి చేసుకుంటోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఇద్దరు యువతులు కొన్ని అనివార్య కారణాల వల్ల చేతులు కలిపి.. ఒక క్రూరమైన శత్రువును ఎదుర్కొనే క్రమంలో సరిహద్దులను దాటి ఎలా పోరాడారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్లతో రూపుదిద్దుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర కేవలం ఒక రెగ్యులర్ స్టంట్ ఉమెన్‌గా మాత్రమే కాకుండా.. హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని పాపుల‌ర్ పాత్ర బ్లాక్ విడో-స్కార్లెట్ జహాన్సన్ తరహాలో భారీ సాహస విన్యాసాలతో రక్తి కట్టించనుంది. లార్జర్ దేన్ లైఫ్ తరహాలో సాగే ఈ పాత్రలో ఆలియా చేసే విన్యాసాలు ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేస్తాయని తెలుస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లోని ఇతర హీరోల కంటే భిన్నంగా ఆలియా భట్ ఇందులో ఒక గూఢచారి లాగా కాకుండా.. ఒక ప్రొఫెషనల్ అస్సాసిన్ (హంతకురాలు)గా నెగటివ్ షేడ్స్ ఉన్న యాంటీ-హీరో పాత్ర‌లో కనిపించనుండటం విశేషం.

చిన్నతనం నుంచే ఒక అస్సాసిన్‌గా మారేందుకు పెంచిన ఒక యువతి కథను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. టైగ‌ర్‌, వార్, పఠాన్ వంటి సంప్రదాయ స్పై సినిమాల కథనాలకు భిన్నంగా నిర్మాత ఆదిత్య చోప్రా ఒక వినూత్నమైన ఆరిజిన్ స్టోరీని ఈ చిత్రంతో అందించబోతున్నారు. ఈ సరికొత్త కోణం సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. అయితే ఈ స్టోరీలైన్ మార్వెల్ `బ్లాక్ విడో`ను పోలి ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. చిన్నతనం నుండి అమ్మాయిలను ఒక లీడర్ (బాబీ డియోల్ పాత్ర) హంతకులుగా ఎలా తీర్చిదిద్దాడు అనే కోణం హాలీవుడ్ చిత్రానికి కాపీ లేదా తిప్పి తీయ‌డం వంటిద‌ని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి విమర్శలు, మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నా..స్కార్లెట్ రేంజులో ఆలియాను చూపిస్తే అది గొప్ప విష‌య‌మే. సాంప్రదాయ పాత్రలతో మెప్పించిన ఆలియా భట్ హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ తో అసంతృప్తిగా ఉన్న నెటిజన్ల విమర్శలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఈ సినిమా నిజంగానే బ్లాక్ విడో తరహా సంచలనాన్ని సృష్టిస్తుందా లేదా అనేది జూలై 10న థియేటర్లలో సినిమా విడుదలయ్యాకే తేల‌నుంది.