Begin typing your search above and press return to search.

ట్రోలింగ్‌కు బ్రేక్… సోషల్ మీడియాకు దూరంగా ఆలియా భట్!

ఇప్పటికే పలువురు స్టార్‌లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, తాజాగా ఆలియా కూడా సోషల్ మీడియా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 March 2026 5:00 PM IST
ట్రోలింగ్‌కు బ్రేక్… సోషల్ మీడియాకు దూరంగా ఆలియా భట్!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ మరోసారి వార్తల్లో నిలిచారు. సెలబ్రిటీలు తరచుగా సోషల్ మీడియా విమర్శలు, ట్రోలింగ్, వ్యక్తిగత ఒత్తిళ్ల మధ్య దాన్నుంచి కొంత విరామం తీసుకోవడం సాధారణమే. ఇప్పటికే పలువురు స్టార్‌లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, తాజాగా ఆలియా కూడా సోషల్ మీడియా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఆలియా స్టేజ్ షో పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు

ఇటీవలి కాలంలో ఆమె ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేజ్‌ల‌పై చేసిన ప్రదర్శనలు, ఫ్యాషన్ అప్పియరెన్సులు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. కొంతమంది నెటిజన్లు ఆమె స్టైల్, ఎంపికలపై విమర్శలు గుప్పించగా, మరికొందరు వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ట్రోలింగ్ ఆమెను లోపల నుంచి ప్రభావితం చేసినట్టుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బయటకు ఎంత నిర్లక్ష్యంగా కనిపించినా, నిరంతర విమర్శలు ఎంత‌టి వారినైనా మానసికంగా కలవరపెడతాయని ఆమెకు దగ్గరైన వ్యక్తులు వెల్లడించారు.

సోష‌ల్ మీడియాకు దూరంగా ఆలియా

ఈ నేపథ్యంలో, ఆలియా కొంతకాలం పాటు సోషల్ మీడియా దూరంగా ఉండి, పూర్తిగా తన కెరీర్ ప‌ర‌మైన కమిట్‌మెంట్స్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రముఖ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెరకెక్కిస్తున్న ల‌వ్ అండ్ వార్ సినిమాపై ఆలియా స్పెష‌ల్ ఫోక‌స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆలియా త‌న భర్త ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో కలిసి నటించనున్నారు. సినిమా రిలీజ్ టైమ్ కు మాత్రమే ఆమె ప్రమోషన్ల కోసం మళ్లీ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫ్యామిలీకి టైమ్ కేటాయించాల‌ని నిర్ణ‌యం

అప్ప‌టివ‌ర‌కు పబ్లిక్ అపియరెన్సులు, ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లు వంటి కార్యక్రమాలకు విరామం ఇవ్వాలని ఆలియా నిర్ణయించుకున్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగతంగా కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుకోవాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. తన కూతురితో ఎక్కువ టైమ్ గడపాలని ఆలియా భావిస్తున్నారని సమాచారం. సోషల్ మీడియా ప్రస్తుతం సెలబ్రిటీలకు ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా అనుసంధానం కల్పించే ప్రధాన వేదిక. అయితే అదే సమయంలో విమర్శలు, అపోహలు, అసత్య ప్రచారాలకు కూడా దారి తీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత కోసం కొంత విరామం తీసుకోవడం సహజమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆలియా భట్ తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికమేనా, లేక దీర్ఘకాలికమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆమె అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తన టాలెంట్ తో, సెలెక్ష‌న్ తో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే ఆలియా, ఈ విరామం అనంతరం మరింత ఉత్సాహంతో తిరిగి వస్తారనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.