Begin typing your search above and press return to search.

ఓట‌మిని జీర్ణించుకోలేని వార‌సురాలు!

బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్- రణబీర్ కపూర్ల ముద్దుల కుమార్తె రాహా కపూర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   14 April 2026 5:00 PM IST
ఓట‌మిని జీర్ణించుకోలేని వార‌సురాలు!
X

బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్- రణబీర్ కపూర్ల ముద్దుల కుమార్తె రాహా కపూర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పుడ‌ప్పుడు రాహా ఫోటోలు..వీడియోలు నెట్టింట లీకై సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. అచ్చంగా తాత‌య్య రిషీ క‌పూర్ ను పోలిన రాహా అల్ల‌రి చేష్ట‌లు నెటి జ‌నుల్ని అంతే ఆక‌ట్టుకుంటాయి. అలాంటి క్యూట్ రాహా గురించి అలియాభ‌ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు షేర్ చేసారు. రాహా వ్యక్తిత్వం, ఆమె ఇష్టాయిష్టాల గురించి ఇలా వివ‌రించారు. తన కుమార్తెకు ఇప్పుడే ఓటమి అంటే ఒక రకమైన అసహనం - భయం ఉన్నాయ‌ని ఆలియా వెల్లడించారు.

రాహా ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు లేదా ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది సరిగ్గా కుదరకపోతే వెంటనే నిరాశ చెందుతుందని ఆలియా తెలిపారు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించే అసహనం, ఆ పనిని పర్ఫెక్ట్‌గా చేయాలనే తపన స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఏదైనా విషయాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా పూర్తి చేయాలని రాహా కోరుకుంటుందని అది జరగనప్పుడు ఆమె కాస్త ఒత్తిడికి లోనవుతుందని ఆలియా వివరించారు. ఈ లక్షణం రాహాకు తన తండ్రి రణబీర్ కపూర్ నుండి వారసత్వంగా వచ్చిందని ఆలియా అభిప్రాయపడ్డారు.

రణబీర్ కూడా ఏదైనా పని చేపడితే అది పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. తన పనుల పట్ల ఆయనకు ఉండే నిబద్ధతే రాహాలోనూ కనిపిస్తోందన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ పోలిక తమను ఆశ్చర్యపరుస్తుందని, రణబీర్ లాగే రాహా కూడా ప్రతి విషయంలోనూ అత్యుత్తమంగా ఉండాలని ప్రయత్నిస్తుందని అలియా చెప్పుకొచ్చారు. ఒక తల్లిగా ఆలియా ఈ విషయంలో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అంత చిన్న వయసులోనే విజయం కోసం పరితపించడం, ఓటమిని చూసి భయపడటం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అలియాభ‌ట్ భావిస్తున్నారు.

అందుకే జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి అనేది నేర్చుకోవడానికి ఒక మెట్టు అని రాహాకు మెల్లగా అర్థమయ్యేలా చెప్పాలని త‌ల్లిదండ్రులుగా నిర్ణయించుకున్నట్లు ఆలియా తెలిపారు. పిల్లలు ఆటపాటలతో స్వేచ్ఛగా పెరగాలన్నదే తన ఉద్దేశమన్నారు. మొత్తానికి రాహా కపూర్ తన తల్లిదండ్రుల లాగే చాలా చురుకైన , బాధ్యతాయుతమైన బాలిక‌గా ఎదుగుతోందని ఈ మాటల ద్వారా అర్థమవుతోంది. సెలబ్రిటీల పిల్లలపై ఉండే అంచనాలు వారిని చిన్నప్పటి నుండే ప్రభావితం చేస్తాయా? లేదా సహజంగానే కొందరు పిల్లలు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారా? అనే కోణంలో ఆలియా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

ప్ర‌స్తుతం అలియాభ‌ట్ `ల‌వ్ అండ్ వార్`, `ఆల్పా`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆల్పా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. `ల‌వ్ అండ్ వార్` మాత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.