ఇకపై ఆలియాను అలాంటి పాత్రల్లో చూడలేమా?
బాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్ధ కాలంగా సత్తా చాటుతున్న టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.
By: Sravani Lakshmi Srungarapu | 6 Sept 2025 3:00 AM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్ధ కాలంగా సత్తా చాటుతున్న టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్. స్టార్ కిడ్ అయినప్పటికీ సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆలియా. రొమాంటిక్ కామెడీల నుంచి ఇంటెన్స్ డ్రామా సినిమాల వరకు ఎన్నో విభిన్న పాత్రలను పోషించిన ఆలియా భట్ ఇప్పుడు తన కూతురు కోసం ఓ సంచలన డెసిషన్ తీసుకున్నారు.
కూతురు చూసేలా ఒక్క సినిమా కూడా చేయలేదు
ఇప్పటివరకూ ఓ లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అంటున్నారు ఆలియా. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో విభిన్న కథలను ఎంచుకుని నటించిన తాను ఇప్పటివరకు తన కూతురు రాహా చూసేలా ఒక్క సినిమా కూడా చేయలేదని, అందుకే ఇకపై తన కూతురు చూసేలా కామెడీ సినిమాల్లో నటించాలని ఉందని ఆలియా చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆలియా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
రాహా కోసం స్పెషల్ గా చేయాలనుంది
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి గల్లీ బాయ్, గంగూబాయి కాఠియావాడి, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ వరకు తాను చేసిన సినిమాలన్నీ చిన్న పిల్లలు చూసే ఏజ్ కు సరిపోవని, అందుకే రాహా కోసం స్పెషల్ గా కొత్త తరహా సినిమాలు చేయాలని ఉన్నట్టు ఆలియా తెలిపారు. రాహా చూసి నవ్వుతూ, ఎంజాయ్ చేసే సినిమాల్లో నటించాలనుకుంటున్నట్టు ఆలియా వెల్లడించారు.
అలాంటి సినిమాలు చేయడమే ఇప్పుడున్న కోరిక
కూతురు కోసమే తన జానర్ ను మార్చుకున్నానన్న ఆలియా ఇప్పటికే కొన్ని సినిమాలకు సైన్ చేశానని, త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. ఆలియా నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే ఇకపై ఆమెను ఇంటెన్స్ డ్రామాలు, బోల్డ్ క్యారెక్టర్లలో చూడటం కష్టమనే అని అర్థమవుతుంది. తన భర్త రణ్‌బీర్ కపూర్ నటించిన బర్ఫీ సినిమా రాహా చూడగలిగేలానే ఉంటుందని, అలాంటి సినిమాలు చేయడమే ఇప్పుడు తన కోరిక అని ఆలియా పేర్కొన్నారు.
ఆ టైమ్ లో రాహాను చూసుకోవడం సవాలుగా అనిపించింది
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఆలియా, ఒక తల్లిగా కూతురి కోసం స్పెషల్ సినిమాలు చేయాలనుకోవడం అభినందించదగ్గ విషయమే. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం అలవాటుగా మారిందన్న ఆలియా, తన భర్త రణ్‌బీర్ కపూర్ తో కలిసి లవ్ అండ్ వార్ చేస్తున్నానని, ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు రాహాను చూసుకోవడం ఛాలెంజింగ్ గా అనిపించిందని, అందుకే పగలంతా రాహాతో ఉండి నైట్ షూట్స్ కు వెళ్లేవాళ్లమని చెప్పారు ఆలియా.
