Begin typing your search above and press return to search.

వరద బాధితుల కోసం ఆలియా పిలుపు.. ప్ర‌శంస‌ల్ని మించి విమర్శలు!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు కేవలం సినిమా ప్రచారాలు, గ్లామరస్ ఫోటోషూట్‌లు.. వ్యక్తిగత విశేషాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   30 July 2026 1:14 AM IST
వరద బాధితుల కోసం ఆలియా పిలుపు.. ప్ర‌శంస‌ల్ని మించి విమర్శలు!
X

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు కేవలం సినిమా ప్రచారాలు, గ్లామరస్ ఫోటోషూట్‌లు.. వ్యక్తిగత విశేషాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ తన సోషల్ మీడియా వేదికను అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక సమస్య వైపు మళ్లించడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో సంభవించిన ఘోర వరదల వల్ల 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవ్వడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయంతో పాటు.. వారు కోలుకోవడానికి దీర్ఘకాలిక మద్దతు అవసరమని పేర్కొంటూ ప్రజలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అసోంలో వరద నీరు ఇంకిపోయినంత మాత్రాన సమస్య ముగిసిపోదని... ఇళ్లు- జీవనోపాధిని కోల్పోయిన కుటుంబాలు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ఆలియా విశ్లేషించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటానని హామీ ఇచ్చారు. తనకున్న క్రేజ్‌ను ఉపయోగించి దేశవ్యాప్తంగా అసోం పరిస్థితిపై స్పృహ పెంచేందుకు ఆలియా తీసుకున్న ఈ చొరవ అభినందనీయమే అయినా.. ఈ ప్రకటన వెనుక కొన్ని ప్రధానమైన ప్రశ్నలు, విమర్శలు కూడా ఎదుర‌వుతున్నాయి

ప్రధానంగా అభిమానులను విరాళాలు ఇవ్వమని కోరిన ఆలియా భట్.. తాను సొంతంగా ఎంత మొత్తం ధనసహాయం చేస్తున్నారో స్పష్టం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాన్య ప్రజలు లేదా అభిమానుల నుంచి మాత్రమే నిధులు సేకరిస్తే అది ఎంతవరకు సరిపోతుందనే ప్ర‌శ్న వినిపిస్తోంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన ఆలియా.. తాను స్వయంగా భారీ విరాళం ప్రకటించి.. తన సహచర స్టార్లను కూడా ప్రేరేపించి ఉంటే ఈ పిలుపునకు మరింత బలం చేకూరేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

దక్షిణాది (ముఖ్యంగా టాలీవుడ్) ఉత్తరాది సినీ పరిశ్రమల మధ్య ఉన్న ఛారిటీ సంస్కృతిని పరిశీలిస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ రకమైన ప్రకృతి విపత్తు వచ్చినా, ఇక్కడి స్టార్ హీరోలు వెంటనే స్పందించి కోట్లాది రూపాయల విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తుంటారు. అంతేకాకుండా.. అందరూ ఒకే వేదికపైకి వచ్చి నిధుల సేకరణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బాలీవుడ్ వర్గాల్లో ఇటువంటి సంస్కృతి చాలా అరుదుగా కనిపిస్తుందనే భావన వ్యక్తమవుతోంది.

అయినా ఆలియా భట్ సామాజిక బాధ్యతతో అసోం వరదలపై స్పందించడం, బాధితులకు నిరంతర సహాయం కావాలని వివరించడం మంచి పరిణామమే అయినా.. కేవలం అభిమానులపై భారం వేయకుండా తానే స్వయంగా ముందుండి నడవాల్సింది. ఆలియా తన వంతుగా భారీ విరాళం ప్రకటించడంతో పాటు బాలీవుడ్‌లోని ఇతర టాప్ సెలబ్రిటీలను కూడా ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములను చేసేలా ప్రేరేపించి ఉండి ఉంటే అసోం వరద బాధితులకు మరింత మెరుగైన, వేగవంతమైన సహాయం అందేదని విశ్లేషిస్తున్నారు.