జీరో సైజ్, సిక్స్ ప్యాక్ మైండ్‌సెట్ మారాలి!
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తల్లిగా మారిన అనంతరం తొలిసారి బాహ్య ప్రపంచంలో కనిపించే సరికి సోషల్ మీడియా వేదికగా క్యాట్ పై కొందరు నెటిజన్లు దారుణమైన బాడీ షేమింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 17 Sept 2026 8:00 PM ISTబాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తల్లిగా మారిన అనంతరం తొలిసారి బాహ్య ప్రపంచంలో కనిపించే సరికి సోషల్ మీడియా వేదికగా క్యాట్ పై కొందరు నెటిజన్లు దారుణమైన బాడీ షేమింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. కత్రినా గర్భధా రణకు ముందు.. తర్వాత రూపాన్ని పోలుస్తూ నెటిజన్లు ట్రోల్ చేయడంపై సినీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కత్రినా అభిమానులు ట్రోలింగ్ ను ఖండించి కౌంటర్లు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కత్రినా సహనటుడు, పాకిస్తానీ నటుడు-గాయకుడు అలీ జఫర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. `మేరే బ్రదర్ కి దుల్హన్` చిత్రంలో కత్రినాతో కలిసి నటించిన అలీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ తల్లిగా మారిన తర్వాత ఆమె శరీరంలో వచ్చే సహజమైన మార్పులను ఎగతాళి చేయడం సభ్యసమాజం చేయాల్సిన పని కాదని.. ఆమెను ప్రశాంతంగా జీవించనివ్వాలని హితవు పలికారు.
ముఖ్యంగా పురుషుల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని అలీ జఫర్ పిలుపు నిచ్చారు. మగవారు సమాజంలో తమకు తామే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మహిళల శరీరాలు .. జీవనశైలి తాము నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే తక్కువ చేసి మాట్లాడే అలవాటు మానుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ లోపాలు ఉంటాయని, ఎదుటివారిని జడ్జ్ చేసేముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలన్నారు.
సమాజం సృష్టించిన కృత్రిమమైన అందాల ప్రమాణాలను అలీ తీవ్రంగా ఖండించారు. ఒకప్పుడు జీరో సైజ్ అని, మగవారికి సిక్స్ ప్యాక్ అని ప్రచారం చేయడం ఏమాత్రం ఆరోగ్యకరమైన సంస్కృతి కాదని పేర్కొన్నారు. కాలంతో పాటు సౌందర్య ప్రమాణాలు మారుతుంటాయని, ప్రతీ వ్యక్తి జీవితంలో అనేక పోరాటాలు, ఒత్తిళ్లు ఉంటాయని గుర్తు చేశారు. తల్లిగా మారిన మహిళ పట్ల అసూయ, ద్వేషం కాకుండా దయ, కరుణ, మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
కత్రినాకు మద్దతుగా అలీ జఫర్ ఒక్కరే కాదు. నటి శివాలికా ఒబెరాయ్ కూడా కత్రినాపై జరిగిన బాడీ ఖండించారు. ఇది మాతృత్వం.. దాన్ని గౌరవించండి అని గట్టిగానే ప్రశ్నించారు. `ఎవరి జీవితం వారిది. ఒకరి రూపంపై కామెంట్లు చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రతీ మహిళకు గతం, వర్తమానం, భవిష్యత్తు ఉంటాయి. ఆమెను స్వేచ్ఛగా బతకనివ్వండి. మీరు ప్రశాంతంగా జీవించండి` అని వ్యాఖ్యానించారు.
అలీ జఫర్ 2010లో `తేరే బిన్ లాడెన్` చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి నటుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అటుపై కత్రినాతో కలిసి నటించిన `మేరే బ్రదర్ కి దుల్హన్`,`లండన్ పారిస్ న్యూయార్క్` వంటి చిత్రాల ద్వారా భారతీయ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం మహిళల పట్ల సమాజంలో ఉన్న భావజాలం, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
