Begin typing your search above and press return to search.

అలీ చేసిన దానికి ఆ డైరెక్ట‌ర్ జీవిత‌మే మారిపోయిందట‌!

డైరెక్ట‌ర్ గా పూరీ సాధించిన విజయాల వెనుక అలీ ఇచ్చిన మానసిక బలం, ఆత్మస్థైర్యం కీలక పాత్ర పోషించాయని చెప్పాలి.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 April 2026 10:00 PM IST
అలీ చేసిన దానికి ఆ డైరెక్ట‌ర్ జీవిత‌మే మారిపోయిందట‌!
X

సినీ ఇండస్ట్రీలో స్టార్‌ల మధ్య స్నేహం అనేది చాలా అరుదుగా కనిపించే విషయం. అయితే పూరి జగన్నాథ్- అలీ మధ్య ఉన్న అనుబంధం మాత్రం అలాంటి అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక మూవీ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ చేసిన ఎమోష‌న‌ల్ స్పీచ్ వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. సినిమా కంటే గొప్పది స్నేహం అనే మాటకు నిజమైన అర్థం ఏమిటో ఈ ఇద్దరి బంధం చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చిన్నప్పటి నుంచి అలీకి అభిమానిగా ఉన్న పూరి, ఆ అభిమానం కాలక్రమేణా జీవితాంతం నిలిచే బంధంగా మారిందని చెప్పడం ఈ అనుబంధంలో ఉన్న డెప్త్ ను తెలియజేస్తుంది.

పూరి జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు అలీ ఎలా తోడుగా నిలిచాడో చెప్పిన సంఘటన అందరినీ కదిలించింది. ఒక దశలో ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయి, తన వద్ద ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి, చివరకు ఆఫీసును కూడా అమ్మేయాల్సిన సిట్యుయేష‌న్ కు వ‌చ్చిన‌ప్పుడు అలీ ముందుకొచ్చాడ‌ని, ఆ రోజు తన జేబులో నుంచి ఒక డిజైన్ ఉన్న గోల్డ్ చైన్ ను తీసి, దానికి కుంకుమ పెట్టి, ఇది మెడలో వేసుకో.. న‌మ్మ‌క లేకపోతే జేబులో పెట్టుకో.. పోయినవన్నీ మళ్లీ వస్తాయ‌ని చెప్పి వెళ్లిపోయిన ఘటన కేవలం సహాయం మాత్రమే కాదు, అది ఒక నమ్మకాన్ని నాటిన క్షణంగా నిలిచింద‌ని, అలీ స్క్రీన్ మీదనే కాద‌ని, రియ‌ల్ లైఫ్ లో కూడా హీరో అని పూరీ పేర్కొన్నారు.

డైరెక్ట‌ర్ గా పూరీ సాధించిన విజయాల వెనుక అలీ ఇచ్చిన మానసిక బలం, ఆత్మస్థైర్యం కీలక పాత్ర పోషించాయని చెప్పాలి. హిట్ వచ్చినప్పుడు అభినందనలు చెప్పడం సులభం. కానీ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం అరుదు. పూరీ క‌ష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు అలీ వచ్చి ఒక పెగ్గు పోసి, భుజం తట్టి వెళ్లిపోతాడ‌ని చెప్ప‌డం చూస్తే, పూరీ లైఫ్ లో అలీ ఎంత కీల‌క‌పాత్ర పోషించారో అర్థమ‌వుతుంది.

అప్ప‌ట్లో అలీ ఇచ్చిన చైన్ విలువ రెండు మూడు ల‌క్ష‌లుంటుంద‌ని, త‌న వ‌ద్ద అప్పుడు ఆ డ‌బ్బు కూడా లేద‌ని, అయినా అలీ ఇచ్చిన గోల్డ్ చైన్ కంటే, అత‌నిచ్చిన ఆత్మ‌విశ్వాస‌మే త‌న‌ను మ‌ళ్లీ నిల‌బెట్టింద‌ని పూరీ చెప్పారు. త‌ర్వాత అలీ చెప్పిన‌ట్టే ఎన్నో ఆర్థిక ఇబ్బందుల త‌ర్వాత కేవ‌లం రెండేళ్ల‌లోనే తిరిగి నిల‌బడి, మ‌ళ్లీ హిట్ ట్రాక్ లోకి వ‌చ్చాన‌ని, దీని వెనుక అలీ పాత్ర ఎంతో ఉంద‌ని పూరీ చెప్పుకొచ్చారు. ఎప్పుడో గ‌తంలో పూరీ మాట్లాడిన ఈ స్పీచ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో అలీ లాంటి ఫ్రెండ్ ఉండాల‌ని నెటిజ‌న్లు భావిస్తూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.