Begin typing your search above and press return to search.

ఒక సాధార‌ణ అలీ స్టార్ క‌మెడియ‌న్ అవ్వ‌డానికి కార‌కుడు!

భారతీరాజా సినిమాల్లో లొకేషన్లు, వాతావరణం కథలో ఒక భాగమైపోతాయి. `సీతాకోకచిలుక` సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని అందమైన సముద్ర తీరాలు, పల్లెటూరి వాతావరణంలో జరిగింది.

By:  Sivaji Kontham   |   10 Jun 2026 11:59 PM IST
ఒక సాధార‌ణ అలీ స్టార్ క‌మెడియ‌న్ అవ్వ‌డానికి కార‌కుడు!
X

తెలుగు చలనచిత్ర చరిత్రలో క్లాసిక్ ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయిన సినిమా `సీతాకోకచిలుక` (1981). పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి తమిళ అగ్ర దర్శకుడు పి. భారతీరాజా దర్శకత్వం వహించారు. ఆ కాలంలో కుల, మతాల పట్టింపులు, సామాజిక ఆంక్షలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో.. ఒక హిందూ యువకుడికి, క్రైస్తవ యువతికి మధ్య చిగురించిన స్వచ్ఛమైన ప్రేమను ఆయన వెండితెరపై ఎంతో అందంగా ఆవిష్కరించారు. సమాజంలో ఉన్న కట్టుబాట్లను ఎదురిస్తూ సాగే ఈ కథ అప్పట్లో ఒక సంచలనం.

భారతీరాజా సినిమాల్లో లొకేషన్లు, వాతావరణం కథలో ఒక భాగమైపోతాయి. `సీతాకోకచిలుక` సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని అందమైన సముద్ర తీరాలు, పల్లెటూరి వాతావరణంలో జరిగింది. అప్పట్లో లొకేషన్స్ అన్నీ చాలా సహజంగా.. పచ్చదనంతో ఉండేవి. భారతీరాజా స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం పోసింది. పాత్రల మధ్య భావోద్వేగాలను... ముఖ్యంగా హీరో హీరోయిన్ల (కార్తీక్, అర్చన) ముగ్ధ మనోహరమైన ప్రేమను సీతాకోకచిలుకల రెక్కల కదలికలతో పోలుస్తూ ఆయన రాసుకున్న సీన్లు.. ఇళయరాజా అద్భుతమైన సంగీతం అప్పటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు ఆలీ (మాస్టర్ ఆలీగా) వెండితెరకు పరిచయం కావడం విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆలీ ఈ సినిమాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాటి షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆలీ పలు ఇంటర్వ్యూలలో గుర్తుచేసుకున్నారు. లొకేషన్‌లో భారతీరాజా చాలా క్రమశిక్షణతో, కోపంగా ఉండేవారట. కానీ చిన్నవాడైన ఆలీ చేసే అల్లరిని చూసి ఆయన ఎంతో ఇష్టపడేవారట. సినిమాలోని చాలా సీన్లలో ఆలీ తన సహజ నటనతో.. టైమింగ్‌తో చిత్ర యూనిట్‌ను సైతం నవ్వించేవాడని అప్పట్లో చెప్పుకునేవారు.

ముఖ్యంగా ఈ సినిమాలో పెళ్లి సంబంధం మాట్లాడటానికి హీరో కార్తీక్ స్నేహితులతో కలిసి చిన్నవాడైన ఆలీ కూడా పెద్ద మనిషిలా పంచె కట్టుకుని... తాంబూలం పళ్ళెం పట్టుకుని విలన్ శరత్ బాబు ఇంటికి వెళ్లే ఒక కామెడీ సీన్ ఉంటుంది. అక్కడ శరత్ బాబు రౌద్ర రూపాన్ని చూడగానే భయంతో ఆలీ పంచె తడిపేసుకునే సీన్ థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలనటుడిగా ఆలీకి మంచి గుర్తింపు రావడమే కాకుండా భవిష్యత్తులో స్టార్ కమెడియన్‌గా ఎదగడానికి బలమైన పునాది పడింది.