Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడిపై నిర్మాత మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌

బాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు అలీ అబ్బాస్ జాఫ‌ర్. స‌ల్మాన్ ఖాన్, అక్ష‌య్ కుమార్ వంటి పెద్ద స్టార్ల‌తో ప‌ని చేసారు

By:  Sivaji Kontham   |   8 Sept 2025 9:54 PM IST
ద‌ర్శ‌కుడిపై నిర్మాత మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌
X

బాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు అలీ అబ్బాస్ జాఫ‌ర్. స‌ల్మాన్ ఖాన్, అక్ష‌య్ కుమార్ వంటి పెద్ద స్టార్ల‌తో ప‌ని చేసారు. అయితే అత‌డు బినామీ కంపెనీని స్థాపించి దానిపై సినిమాలు నిర్మిస్తూ, పెద్ద ఎత్తున‌ మ‌నీలాండ‌రింగ్ కి పాల్ప‌డుతున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు నిర్మాత వాషు భ‌గ్నానీ. న‌ల్ల ధ‌నాన్ని ఇండ‌స్ట్రీలో పెట్టుబ‌డుల పేరుతో వైట్ గా మారుస్తున్నాడ‌ని ఆరోపించారు.

అంతేకాదు ఈ విష‌య‌మై ఎన్ ఫోర్స్‌మెంట్ (ఈడీ), ఆర్థిక నేరాల విభాగం (EOW) , సీబీఐని సంప్రదించాలని యోచిస్తున్న‌ట్టు నిర్మాత వాసు భ‌గ్నానీ తెలిపారు. పోగొట్టుకున్న డబ్బును రాబ‌ట్ట‌డం కోసం కాదు. నిజం బయటకు రావడం కోస‌మే ఇదంతా. ఇలా చేయ‌డం దేనికి అంటే? మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు! అని ఆయన అన్నారు.

నిజానికి అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `బ‌డే మియాన్ చోటే మియాన్` చిత్రీకరణ సమయంలో జాఫ‌ర్- భ‌గ్నానీ (ద‌ర్శ‌కుడు- నిర్మాత‌) మ‌ధ్య వివాదం రాజుకుంది. సినిమా పేరుతో జాఫ‌ర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని నిర్మాత వాషు భగ్నానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ఆరోపించుకున్నారు. ఆ త‌ర్వాత ఈ వివాదం చినికి చినికి గాలి వానైంది.

సోమవారం చాలా స్ప‌ష్ఠంగా జాఫర్‌పై భగ్నాని కొత్త ఆరోపణలు చేశారు. వాటిలో బినామీ (ప్రాక్సీ యాజమాన్యంలోని) కంపెనీని నడపడం, మనీ లాండరింగ్‌లో పాల్గొనడం వంటి ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వాషు భగ్నాని ద‌ర్శ‌కుడు జాఫ‌ర్‌కి చెందిన‌ జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌సి అనే కంపెనీ లొసుగుల్ని ఎత్తి చూపారు. ఇది అధికారికంగా అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ. ముంబై అంధేరీ నుండి నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీని పెద్ద మొత్తంలో డబ్బును మ‌నీలాండరింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. బ‌డే మియాన్ చోటే మియాన్ కోసం ఆర్థికంగా నేను స‌హ‌కారం అందించాను.

అలీ అబ్బాస్ జాఫర్ - హిమాన్షు మెహ్రా ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. కానీ రెండు నెలల క్రితమే నేను జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌సి అనే కంపెనీ వారికి ఉంద‌ని కనుగొన్నాను. ఇది వారి గ్రూప్‌లో భాగమని నేను మొదట భావించాను. తరువాత అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేసి ఉంద‌ని, రహస్యంగా నిర్వహిస్తున్నార‌ని క‌నుక్కున్నాను! అని భగ్నానీ ఆరోపించారు. తెరవెనుక పెద్ద ఆర్థిక కుట్ర దాగి ఉందని వాషు భగ్నాని పేర్కొన్నారు. ఈ కంపెనీని భారీ స్థాయిలో అక్రమ ఆర్థిక లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని తాను న‌మ్ముతున్న‌ట్టు భ‌గ్నానీ తెలిపారు.

అలాగే సినిమా నిర్మాణ బ‌డ్జెట్ ని 80కోట్లు పెంచార‌ని, న‌టీన‌టుల ఫీజుల విష‌యంలో ఖాతాల‌ను వారు ప‌రిష్క‌రించ‌లేద‌ని ఆరోపించారు. 11 నెలలు పదే పదే అభ్యర్థించిన తర్వాత కూడా, అకౌంటెంట్ తుది ఆర్థిక నివేదికలను అందించడానికి నిరాకరించారు. పైగా పరిశ్రమలోని వ్యక్తులకు తాము కేవలం డైరెక్టర్లమే తప్ప నిర్మాతలు కాదని చెబుతున్నారు! అని కూడా వాషు భ‌గ్నానీ అన్నారు. బాంద్రా పీఎస్‌లో జాఫ‌ర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ధృవీకరించారు. ప్రస్తుతానికి అలీ అబ్బాస్ జాఫర్ తాజా ఆరోపణలపై స్పందించలేదు.