150 సార్లు పిల్లి మొగ్గలు వేసిన నటి.. కారణం తెలుసా?
ప్రస్తుతం ఆలయ కెరీర్ ఆశాజనకంగా సాగుతోంది. ఇటీవల రాజ్ కుమార్ రావు సరసన `శ్రీకాంత్` చిత్రంలో నటించి మెప్పించారు. మునుముందు మరికొన్ని భారీ ప్రాజెక్టులలో భాగం కానున్నారు.
By: Sivaji Kontham | 11 April 2026 9:32 AM ISTబాలీవుడ్ యువ నటి ఆలయ ఫర్నిచర్ వాలా తన పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్‌స్టాలో తాను చూసిన ఒక కఠినమైన యోగా ఆసనాన్ని పర్ఫెక్ట్‌గా చేయడానికి ఏకంగా 150 సార్లకు పైగా పిల్లిమొగ్గలు వేస్తూ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆలయ మోచేతులు రాపిడికి గురై చర్మం ఊడిపోవడమే కాకుండా..వికారం వంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. అయినా తాను అనుకున్నది సాధించే వరకు విశ్రమించకుండా ఆ ఆసనాన్ని అద్భుతంగా వేసి తన పట్టుదలను చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దిశా పటాని వంటి తోటి నటీమణులు `క్రేజీ` అంటూ ప్రశంసలు కురిపించారు.
ఆలయ ఫర్నిచర్ వాలా తన కెరీర్‌ను `జవానీ జానేమన్` (2020) చిత్రంతో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా తను చేసిన నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ డెబ్యూ నటి అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత ఫ్రెడ్డీ, యూ-టర్న్, ఆల్మోస్ట్ ప్యార్ విత్ డిజె మొహబ్బత్ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ నటి పూజా బేడీ కుమార్తె అయినా.. కేవలం వారసత్వంతోనే కాకుండా తన సొంత ప్రతిభతో బాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ కెరీర్ ఆశాజనకంగా సాగుతోంది. ఇటీవల రాజ్ కుమార్ రావు సరసన `శ్రీకాంత్` చిత్రంలో నటించి మెప్పించారు. మునుముందు మరికొన్ని భారీ ప్రాజెక్టులలో భాగం కానున్నారు.
కేవలం సినిమాలే కాకుండా, ఆలయ ప్రకటనల రంగంలోనూ దూసుకుపోతున్నారు. తన ఫిట్‌నెస్ -స్టైలిష్ లుక్స్‌తో పలు ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగానే ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్ బ్రాండ్ వాల్యూను పెంచడానికి తోడ్పడుతోంది. యోగా, వర్కవుట్ వీడియోలతో నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటూ.. యువతకు ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారుతున్నారు.
అయితే తన మొండితనం గురించి ఆలయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన ఫిట్‌నెస్ కోచ్‌లు తనను `మొండిది` అని పిలుస్తారని.. అది తనకు ఇష్టమైన బిరుదు అని పేర్కొన్నారు. తన శరీరం అలసిపోయినా.. అనుకున్నది సాధించే వరకు ప్రయత్నించడం తన నైజమని చెబుతూనే.. ప్రతి ఒక్కరూ తమ శరీరం ఇచ్చే సంకేతాలను వినాలని.. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏకాగ్రత కుదిరినప్పుడే కఠినమైన ఆసనాలు సాధ్యమవుతాయని.. అందుకోసం పడే శ్రమను ఈ వీడియో ద్వారా గుర్తుచేశారు.
ఆలయ ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. అయితే వాటికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటు సౌత్ లోను ఎంట్రీ ఇచ్చేందుకు ఆలయ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ ఆరంగేట్రం ఏ హీరోతో ఉంటుందో ఇంకా రివీల్ కావాల్సి ఉంది.
