స్మార్ట్ వర్క్ vs హజిల్ కల్చర్: మారుతున్న వర్క్ స్టైల్‌పై అలాయా కామెంట్!
యువ నటి అలాయా ఎఫ్ నేటి తరం ఆలోచనా ధోరణిపై పంచుకున్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
By: Srikanth Kontham | 4 Sept 2026 5:00 PM ISTబాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ నటి అలాయా ఎఫ్ నేటి తరం ఆలోచనా ధోరణిపై పంచుకున్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. కెరీర్‌లో రాణించేందుకు లేదా విజయాన్ని అందుకునేందుకు పడే శ్రమ అనేది అనివార్య ప్రక్రియే అయినా? కష్టపడటాన్ని మాత్రమే గొప్ప సత్గుణంగా ... గొప్పతనంగా భావించే రోజులు పోయాయని అలయా అభిప్రాయపడ్డారు. నేటి జెన్-జీ తరం కష్టపడటం కంటే తెలివైన ప్రణాళిక, ఆత్మరక్షణ , సమతుల్యమైన జీవితానికే ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
సాధారణంగా పాత తరాల్లో నిరంతరం కష్టపడటం, విశ్రాంతి లేకుండా శ్రమించడాన్ని ఏకైక విజయ మంత్రంగా చూసేవారు. అయితే నేటి యువత ఆ భావనను పూర్తిగా తిరస్కరిస్తోందని అలాయా అభిప్రాయపడ్డారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కష్టపడటమే జీవిత లక్ష్యంగా జీవించడం సమర్థనీయం కాదని, శ్రమతో పాటు సరైన విశ్రాంతి, మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని జెన్-జీ విశ్వసిస్తోందని వివరించారు. కష్టపడటాన్ని గొప్పతనంలా ప్రదర్శించే హజిల్ కల్చర్ కంటే స్వీయ సంరక్షణకే వారు మొగ్గు చూపుతున్నారు.
హిందీ పరిశ్రమలో అలయా ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సినీ పరిశ్రమలోని వృత్తిపరమైన ఒత్తిడులు .. సోషల్ మీడియా గందరగోళం మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో పంచుకున్నారు. పనిలో క్రమశిక్షణ ఉండటం ఎంత ముఖ్యమో? అనవసరమైన సమాచార ఘోషకు దూరంగా ఉండటం కూడా అంతే అవసరమని తెలిపారు. రోజువారీ జీవితంలో డిజిటల్ డిటాక్స్ పాటించడం, అనవసరమైన నోటిఫికేషన్‌లను నిలిపివేయడం ద్వారా మైండ్‌ఫుల్‌నెస్‌ను కాపాడుకోవచ్చని ఇది పనిలో మరింత ఉత్పాదకతను ఇస్తుందని అలాయా పేర్కొన్నారు.
కెరీర్ ప్రారంభంలో నటన మాత్రమే ప్రధాన బాధ్యత అని అనుకున్నానని కానీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాతే నటన అనేది మొత్తం పనిలో కేవలం కొంత భాగం మాత్రమేనని అర్థమైందని అలాయా అభిప్రాయపడ్డారు. ప్రెజెంటేషన్, నెట్‌వర్కింగ్, మానసిక స్థిరత్వం వంటివి సినీ రంగంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. విజయం కోసం కష్టపడటం సహజమే అయినా? ఆ కష్టాన్ని శారీరక, మానసిక అలసటకు గురిచేసే స్థాయికి తీసుకెళ్లకూడదనే స్పష్టత నేటి నటీనటులకు ,యువతకు ఉందని అభిప్రాయపడ్డారు.
డిజిటల్ యుగంలో మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ప్రయాణిస్తూనే ఉనికిని కోల్పోకుండా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరమని అలాయా నొక్కి చెప్పారు. వ్యక్తిగత ఎదుగుదల, శారీరక దారుఢ్యం , మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సుదీర్ఘకాలం పాటు రంగంలో నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. కేవలం శ్రమించడమే పరమావధి అనుకోకుండా ఆ శ్రమకు సరైన దిశ , స్వీయ గౌరవం తోడైనప్పుడే అది నిజమైన విజయంగా మారుతుందని పేర్కొన్నారు.
