118 హార్డ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో అలియా ఎఫ్!
బాలీవుడ్ కథానాయిక అలయా ఎఫ్ ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 5 Oct 2026 12:34 AM ISTబాలీవుడ్ కథానాయిక అలయా ఎఫ్ ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక నియంత్రణను పెంచే కఠినమైన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లను స్వీకరించడంలో అమ్మడు ముందుంటారు. తాజాగా యంగ్ బ్యూటీ 118 హార్డ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మునుపటి ఫిట్‌నెస్ రొటీన్‌ల ద్వారా తన జీవితంలో లభించిన అద్భుతమైన మార్పుల కారణంగానే ఈ కఠిన నిబంధనలకు అలవాటు పడ్డానని పంచుకున్నారు.
గతంలో పలుమార్లు 75 హార్డ్ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసిన అలయా ఈసారి ఆ ఛాలెంజ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఏడాది సమయానికి మిగిలిన రోజులను లెక్కించి ఏకంగా 118 రోజుల పాటు నిరంతరాయంగా ఈ ఛాలెంజ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి విరామం లేకుండా వరుసగా 118 రోజుల పాటు రోజువారీగా నిర్దేశించుకున్న ఐదు నియమాలను పూర్తి చేయడమే ఈ ఛాలెంజ్ లక్ష్యం. `తొలిసారి ఈ ఛాలెంజ్ చేసినప్పుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. నా శరీరం, మనస్సు ఎంతవరకు సవాలును స్వీకరించగలవు? దీని ద్వారా నేనెంత మెరుగ్గా మారగలను? అనే కుతూహలంతోనే మళ్లీ చేస్తున్నాను` అని పేర్కొన్నారు.
పండుగల సీజన్, పెళ్లిళ్ల సందడి, చివరికి పుట్టినరోజు కూడా వచ్చే సమయాన్నే అలయా ఈ ఛాలెంజ్ కోసం ఎంచుకోవడం విశేషం. సాధారణంగా ఇలాంటి పండుగలు, వేడుకల సమయంలో ఆహార నియమాలు, రోజువారీ వ్యాయామం పక్కనబెట్టే అవకాశాలు ఎక్కువ. అయితే ప్రలోభాలు ఎక్కువగా ఉండే కాలంలోనే ఇలాంటి కఠినమైన నియమాలను పాటిస్తే మానసిక స్థైర్యం విశేషంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. సాధారణ రోజుల్లో క్రమశిక్షణతో ఉండటం తేలికే కానీ వేడుకల సమయంలో నియమాలకు కట్టుబడి ఉండటమే నిజమైన మానసిక పరీక్ష అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఫిట్‌నెస్ విధానంతో శారీరక దృఢత్వంతో పాటు అమితమైన మానసిక స్పష్టత లభిస్తుందని అలయా తెలిపారు. నిరంతర క్రమశిక్షణ వల్ల మెదడు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని, అంతర్వాణి మరింత స్పష్టంగా వినిపిస్తుందన్నారు. దీంతో క్లిష్టమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, నిర్ణయాల పట్ల స్పష్టమైన నమ్మకంతో ముందడుగు వేయడానికి ఈ ఫిట్‌నెస్ విధానం ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే 2024లో విడుదలైన `శ్రీకాంత్` తర్వాత అలయా వెండితెరపై మళ్లీ కనిపించలేదు. ఈ రెండేళ్ల విరామ సమయంలో లభించిన మానసిక ప్రశాంతతకు కూడా ఫిట్‌నెస్ అలవాట్లే కారణమని వెల్లడించారు. బయటకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా? ఈ రెండేళ్ల కాలంలోనే మునుపెన్నడూ లేనంత బిజీగా పని చేశానని పేర్కొన్నారు. అంతర్గతంగా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లోనటిస్తున్నానన్నారు. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తామన్నారు.
