2026లో సౌత్‌పై హిందీ నటుడి దండయాత్ర
ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన `చావా` సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో నటించాడు అక్షయ్ ఖన్నా. అతడి నటనకు క్రిటిక్స్ సహా సామాన్య ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.
By: Sivaji Kontham | 14 Dec 2025 10:50 AM ISTగతం కంటే వర్తమానం చాలా ముఖ్యం. గతం ఒక పాఠం అనుకుంటే, వర్తమానంలో దాని పర్యవసానాన్ని పాజిటివ్ ఫలితం కోసం తెలివిగా మలుచుకోవడమే ఏ కళాకారుడికి అయినా నేర్పరితనంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు అలాంటి పర్యవసానాన్ని ఎదుర్కోబోతున్నాడు అక్షయ్ ఖన్నా. తన బట్టతల (బాల్డ్ హెడ్) కారణంగా ఆఫర్లు లేక దాదాపు దశాబ్ధంపైగా కనుమరుగైపోయిన ఈ నటుడు, ఇప్పుడు కొన్ని క్రేజీ ఆఫర్లతో తిరిగి రీబూట్ అయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన `చావా` సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో నటించాడు అక్షయ్ ఖన్నా. అతడి నటనకు క్రిటిక్స్ సహా సామాన్య ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ లో ఫైనెస్ట్ స్టార్లలో అక్షయ్ ఖన్నా ఒకరు అని మరోసారి నిరూపణ అయింది.
చావా చిత్రంలో అత్యంత క్రూరుడైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా అభినయం, ఆహార్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. శంభాజీ మహారాజ్ ని హింసించే క్రూరుడైన ఔరంగజేబుని చంపేయాలి! అనేంత ఉద్రేకం పుట్టుకొచ్చింది థియేటర్లలో. దానికి కారకుడు అక్షయ్ ఖన్నా. ఆ తర్వాత ఏడాది ముగింపులోను అతడు మరో ప్రామిస్సింగ్ రోల్ లో నటించి దేశవ్యాప్తంగా చర్చల్లోకొచ్చాడు. రణ్ వీర్ సింగ్ - ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన `దురంధర్`లో క్రూరుడైన విలన్ పాత్రతో షో స్టాపర్‌గా నిలిచాడు అక్షయ్ ఖన్నా.
పాకిస్తాన్ లోకల్ గూండా రెహ్మాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనను క్రిటిక్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. అతడు తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో కట్టి పడేసాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి పాత్రలో క్రూరత్వం, కొద్దిపాటి ఫన్- హాస్యం కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. దురంధర్ 10వ రోజుకు 300కోట్ల క్లబ్ లో చేరుతుందని కథనాలొచ్చాయి.
ఇక ఇలాంటి అసాధారణ బ్లాక్ బస్టర్‌లో భాగం అయిన అక్షయ్ ఖన్నా, ఇకపై నటుడిగా తన గేమ్ ని మార్చాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అతడు ఇప్పటికే పలువురు సౌత్ డైరెక్టర్లకు టచ్ లో ఉన్నాడు. సైఫ్ ఖాన్, బాబి డియోల్, సన్నీడియోల్ తరహాలోనే అక్షయ్ ఖన్నాను కూడా సౌత్ కి తీసుకు రావాలని మన ఫిలింమేకర్స్ ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక మంచి పెర్ఫామర్ ని ప్రోత్సహించేందుకు సౌత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అక్షయ్ ఖన్నా టైమ్ వచ్చిందని భావిస్తున్నారు. 2025 ను తన ఖాతాలో వేసుకున్న ఖన్నా, 2026లో అంతకుమించి నిరూపించాలని పంతంతో ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా అతడికి సౌత్ నుంచి ఇకపై క్రూరమైన విలన్ పాత్రలను ఆఫర్ చేసేందుకు ఆస్కారం ఉంది.
