Begin typing your search above and press return to search.

లాభంలో 72 శాతం షేర్ హీరోకి- 28 శాతం నిర్మాత‌కా? ఇందులో లాజిక్ ఏదీ?

ఒక సినిమా లాభాల్లో సింహభాగం హీరోకే వెళ్తే... వందల కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతకు మిగిలేది కేవలం 28 శాతమేనా అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి.

By:  Sivaji Kontham   |   8 Jun 2026 9:00 PM IST
లాభంలో 72 శాతం షేర్ హీరోకి- 28 శాతం నిర్మాత‌కా? ఇందులో లాజిక్ ఏదీ?
X

భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల పారితోషికాలు, సినిమా బడ్జెట్లను మించిపోతున్నాయనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ `వెల్కమ్ 3` (వెల్కమ్ టు ది జంగిల్) సినిమా కోసం కుదుర్చుకున్నాడనే ఒక ఒప్పందం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ ఈ సినిమా కోసం ముందస్తుగా కేవలం రూ. 1.8 కోట్లు మాత్రమే తీసుకుని.. మిగతాదంతా సినిమా ఐపీఆర్ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) రెవెన్యూ లాభాల్లో ఏకంగా 72 శాతం షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నాడనే వార్త ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఒక సినిమా లాభాల్లో సింహభాగం హీరోకే వెళ్తే... వందల కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతకు మిగిలేది కేవలం 28 శాతమేనా అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి.

గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల గణాంకాలను పరిశీలిస్తే ఈ 72-28 శాతం ఫార్ములా ఎంతవరకు సాధ్యమనే అనుమానాలు రావడం సహజం. ఉదాహరణకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `బాహుబలి 2` చిత్రాన్ని సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే... అది ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడున్న ఈ కొత్త లాజిక్ ప్రకారం చూస్తే.. వచ్చిన లాభాల్లో 72 శాతం వాటా హీరోకే వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్? అలాగే వందల కోట్ల భారీ పెట్టుబడి పెట్టి.... అన్ని రకాల రిస్కులను భరించిన నిర్మాతకు కేవలం 28 శాతం మాత్రమే దక్కడం ఏ రకమైన న్యాయం అనే చర్చ నడుస్తోంది.

ఇదే తరహా సమీకరణాన్ని ఇటీవల సంచలనం సృష్టించిన `యానిమల్` సినిమాకు కూడా వర్తింపజేసి చూస్తున్నారు విశ్లేషకులు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా `యానిమల్` చిత్రాన్ని నటీనటుల పారితోషికాలు కాకుండా కేవలం రూ. 100 కోట్ల మేకింగ్ బడ్జెట్‌తో పూర్తి చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 900 కోట్లు రాబట్టింది. అంటే బడ్జెట్ మినహాయించగా మిగిలిన రూ. 800 కోట్ల భారీ లాభాల్లో 72 శాతం వాటాను హీరో ఒక్కడే పట్టుకుపోతే, రాత్రింబగళ్లు శ్రమించి సినిమాను మార్కెట్ చేసిన నిర్మాత కేవలం 28 శాతం వాటాతో సరిపెట్టుకోవాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ఇదే ఫార్ములాను `వెల్కమ్ 3` విషయానికి అన్వయిస్తే.. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి రూ. 1000 కోట్లు వసూలు చేసిందనుకుందాం. స్టార్ హీరో అక్షయ్ కుమార్ పన్నిన ఈ తెలివైన పన్నాగం ప్రకారం.. అందులో రూ. 700 కోట్లు నేరుగా ఆయన ఖాతాకే వెళ్ళిపోతాయి. వంద కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసిన నిర్మాతకు చివరకు మిగిలేది కేవలం రూ. 280 కోట్లు మాత్రమే. సినిమా థియేటర్లలో కేవలం బ్రేక్ ఈవెన్ దాటి స్వల్ప లాభాలు తెచ్చినా, లేదా ఓ మోస్తరుగా ఆడినా నిర్మాతకు వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ సినిమాకు రిలీజ్ కాకముందే ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల రూపంలో రూ. 120 కోట్ల బిజినెస్ జరిగిందనే టాక్ కూడా ఉంది కాబట్టి... నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లేనని కొందరు భావిస్తున్నారు.

అయితే ఈ తరహా `హై-రిస్క్, హై-రివార్డ్` ఒప్పందాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే హీరోకి కేవలం రూ. 1.8 కోట్లు మాత్రమే మిగులుతాయి కాబట్టి ఇది హీరో వైపు నుంచి కూడా పెద్ద రిస్కేనని కొందరు సమర్థిస్తున్నారు. కానీ సినిమా సూపర్ హిట్ అయినప్పుడు వచ్చే లాభాల్లో హీరోలు భారీగా వాటాలు పట్టుకుపోతున్నప్పుడు.... ఒకవేళ సినిమా ఫెయిల్ అయి భారీ నష్టాలు వస్తే ఆ నష్టాల్లో కూడా హీరోలు వాటా పంచుకోవాలి కదా అనే డిమాండ్ ట్రేడ్ వ‌ర్గాల‌ నుంచి బలంగా వినిపిస్తోంది. కేవలం లాభాల్లోనే 72 శాతం వాటా అడగడం... నష్టాల బాధ్యతను పూర్తిగా నిర్మాతపైనే నెట్టేయడం చిత్ర పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.