రిటైర్మెంట్‌పై పెద్ద హీరో పెద్ద కామెంట్: చావు ముందు 5 సెకన్లే విశ్రాంతి!
అక్షయ్ కుమార్ తన విలక్షణమైన శైలిలో స్పందిస్తూ.. ఒకవేళ నేను గనుక సినిమాల నుండి విరమిస్తే ఇంట్లో ఖాళీగా కూర్చోలేను.
By: Sivaji Kontham | 12 Jun 2026 11:24 PM ISTభారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద హీరో తన మరణానికి ముందు జరిగే ఒక పెద్ద విషయం గురించి ఏం మాట్లాడారో వింటే ఆశ్చర్యం కలగక మానదు. మరణానికి ఐదు సెకన్ల ముందు మాత్రమే విశ్రాంతి తీసుకుంటానని ఆయన చేసిన కామెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే....
ఆ పెద్ద హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ యాక్షన్ కింగ్, మోస్ట్ డిసిప్లిన్డ్ యాక్టర్ అక్షయ్ కుమార్. ఆయన రిటైర్మెంట్ పై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిరంతరం బిజీగా ఉండే అక్షయ్ కుమార్ తన లైఫ్ ఫిలాసఫీని వివరిస్తూ చేసే పనిపై తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు ఇప్పుడప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పే ఉద్దేశం అస్సలు లేదని తేల్చి చెప్పారు.
అక్షయ్ కుమార్ తన విలక్షణమైన శైలిలో స్పందిస్తూ.. ఒకవేళ నేను గనుక సినిమాల నుండి విరమిస్తే ఇంట్లో ఖాళీగా కూర్చోలేను. నా సొంత ఇంట్లోనే ఒక తోటమాలిగా (గార్డెనర్), ఒక ఎలక్ట్రీషియన్‌గా లేదా కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే వ్యక్తిగా మారిపోవాల్సి వస్తుంది. అంటే ఇంట్లోని అన్ని పనులను నేనే స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది!! అని సరదాగా పేర్కొన్నారు. ఆ పనులన్నీ చేయడం కంటే వెండితెరపై నటనను కొనసాగించడమే ఎంతో ఉత్తమమైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
వర్క్ లైఫ్ పై తనకున్న నిబద్ధతను తెలియజేస్తూ అక్కీ ఒక ఎమోషనల్ లైన్ చెప్పారు. ``ఒక మనిషి తన జీవితంలో చనిపోవడానికి కేవలం ఐదు సెకన్ల ముందు మాత్రమే రిటైర్ అవుతాడు`` అంటూ జీవితాంతం పని చేస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు. రిటైర్మెంట్ గురించి ఆలోచించకుండా నిరంతరం శ్రమిస్తూ ఉండాలని.. ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలనుకునే వారు క్రమం తప్పకుండా ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్‌గా ఉండటం ఎంతో అవసరమని అక్షయ్ కుమార్ సూచించారు.
అక్షయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అతడి అభిమానులతో పాటు నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పరిశ్రమలో హెల్తీ లైఫ్ స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అక్షయ్ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడమే కాకుండా.. నిరంతర శ్రమనే తన దీర్ఘాయువుకు రహస్యమని చెప్పడం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోంది. వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ బాలీవుడ్ ఖిలాడీ తన కెరీర్ ముగింపుపై వస్తున్న రూమర్లకు ఈ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్‌తో గట్టి సమాధానమే ఇచ్చారు. అక్కీ నటించిన భారీ మల్టీస్టారర్ వెల్‌కం 3 త్వరలో విడుదలకు రానుంది. తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో చాలా రహస్యాలను విప్పుతున్నాడు ది గ్రేట్ అక్కీ.
