Begin typing your search above and press return to search.

'ఫ్లాప్ యాక్టర్' టైటిల్‌పై స్టార్ హీరోలో తీవ్ర అంత‌ర్మ‌ధ‌నం!

ఫ‌లానా హీరో ఫ్లాప్ హీరో అని ఎవ‌రైనా పిలిస్తే ఆ పిలుపు ఎంత‌గా ద‌హించి వేస్తుందో ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా? అత‌డు `ఐరెన్ లెగ్` అని ముద్ర ప‌డిపోతే అప్ప‌టివ‌ర‌కూ ఉన్న మార్కెట్ పూర్తిగా పాతాళానికి ప‌డిపోతుంది.

By:  Sivaji Kontham   |   12 Jun 2026 5:00 PM IST
ఫ్లాప్ యాక్టర్ టైటిల్‌పై స్టార్ హీరోలో తీవ్ర అంత‌ర్మ‌ధ‌నం!
X

ఫ‌లానా హీరో ఫ్లాప్ హీరో అని ఎవ‌రైనా పిలిస్తే ఆ పిలుపు ఎంత‌గా ద‌హించి వేస్తుందో ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా? అత‌డు `ఐరెన్ లెగ్` అని ముద్ర ప‌డిపోతే అప్ప‌టివ‌ర‌కూ ఉన్న మార్కెట్ పూర్తిగా పాతాళానికి ప‌డిపోతుంది. నిజానికి బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ మొన్న‌టికి మొన్న `భూత్ బంగ్లా`తో విజ‌యం అందుకోక మునుపు ప‌రిస్థితి పూర్తిగా ఇలానే ఉంది. అత‌డు ఫ్లాప్ యాక్ట‌ర్ అంటూ ప‌క్క‌న పెట్టేసే స‌న్నివేశ‌మే ఎదురైంది. వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు పెట్టే సెంటిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో అత‌డి ప‌రాజ‌యాల రికార్డ్ నిజంగా ట్రేడ్ వ‌ర్గాల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. అయినా స‌రైన స‌మ‌యంలో అత‌డు హిట్టు కొట్టి తిరిగి ట్రాక్ లోకి వ‌చ్చాడు. లేదంటే అత‌డిని పూర్తిగా ప‌ట్టించుకోని ప‌రిస్థితులు దాపురించేవి.

అయితే ఆ మ‌ద‌నం అత‌డిలో ఇప్ప‌టికీ అలానే ఉంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ `వెల్‌కమ్ టు ది జంగిల్` ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. అయితే ఈ ట్రైలర్‌లో అక్షయ్ కుమార్‌ను ఉద్దేశించి వచ్చే `ఫ్లాప్ యాక్టర్` అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు , అభిమానుల మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. అక్షయ్ కుమార్ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ డైలాగ్ రావడం యాధృచ్ఛికంగా అనిపించినా దీనిపై అక్షయ్ కుమార్ ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అత్యంత సరదాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఆ ఈవెంట్‌లో అక్షయ్ మాట్లాడుతూ.. ట్రైలర్‌లోని ఆ డైలాగ్ కేవలం సినిమాలో తను పోషించిన పాత్రను ఉద్దేశించి అన్నదే కానీ... దానికి తన నిజజీవిత కెరీర్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రేక్షకులు ఆ డైలాగ్‌ను సినిమా కథ- పాత్రల సందర్భానుసారంగానే చూడాలని కోరారు. సినిమాల్లో వచ్చే ప్రతి డైలాగ్‌ను మేము వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి....ఒకరినొకరు నిందించుకోవడానికి లేదా ఎగతాళి చేయడానికి ఉపయోగించము. అది కేవలం స్క్రిప్ట్‌లో భాగం మాత్రమే! అని అక్షయ్ అన్నారు. అంతేకాకుండా.. ఆ డైలాగ్ విని బాధపడిన తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ``నా కోసం బాధపడినందుకు చాలా థాంక్స్. కానీ దయచేసి ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు`` అంటూ నవ్వుతూ కోరారు.

సినిమాలోని రీల్ లైఫ్‌ను, నిజ జీవితంలోని రియల్ లైఫ్‌ను వేర్వేరుగా చూడాలని అక్షయ్ కుమార్ అభిమానులను కోరారు. వెండితెరపై రాసే డైలాగులు ఆ ప్ర‌త్యేక‌మైన‌ సన్నివేశాల బలాన్ని... పాత్రల స్వభావాన్ని బట్టి డిజైన్ చేస్తారు కాబట్టి స్క్రీన్ పై కనిపించే ప్రతి లైన్‌ను ఒక నటుడి వ్యక్తిగత జీవితానికి లేదా వారి కెరీర్ గ్రాఫ్‌కు ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. అక్షయ్ కుమార్ ఇచ్చిన ఈ ఈజీ-గోయింగ్ సమాధానానికి ఈవెంట్‌కు హాజరైన వారంతా నవ్వుతూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.

ఇదే వేదికపై అక్షయ్ కుమార్ 1990ల కాలంలో తనతో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సీనియర్ నటి రవీనా టాండన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ రోజుల్లో ర‌వీనాతో కలిసి పనిచేసిన ఒక పాత షూటింగ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ... రవీనా టాండన్‌కు చేసే పనిపై ఉన్న అంకితభావం-క్రమశిక్షణను కొనియాడారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో సూర్యాస్తమయం అయ్యేలోపు ఒక సీన్ పూర్తి చేయాల్సి ఉందని.. ఆ సమయంలో రవీనాకు కాస్ట్యూమ్ మార్చుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే లభించిందని అక్షయ్ గుర్తుచేసుకున్నారు. అయినా త‌ను ఎంతో వేగంగా రెడీ అయి సెట్‌లోకి అడుగుపెట్టడం వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని సీనియ‌ర్ న‌టి ప్రొఫెషనలిజాన్ని అభినందించారు.

మొత్తానికి `వెల్‌కమ్ టు ది జంగిల్` సినిమాతో అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన కామెడీ టైమింగ్‌తో హిట్‌ ట్రాక్‌ ఎక్కడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ట్రైలర్‌లో తనపై వచ్చిన సెల్ఫ్-ట్రోల్ డైలాగ్‌ను కూడా ఎంతో హుందాగా సరదాగా స్వీకరించి అక్షయ్ కుమార్ తనలోని మెచ్యూరిటీని చాటుకున్నారు. రవీనా టాండన్‌తో కలిసి కొంత గ్యాప్ త‌ర్వాత తిరిగి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆనందం అత‌డిలో క‌నిపిస్తోంది. మంచి హిట్టుతో అది రెట్టింప‌వ్వాల‌ని ఆకాంక్షిద్దాం.