సంగీత దర్శకుడి బయోపిక్ లో సంచలన మార్పులు!
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ (పంచమ్ దా) జీవిత చరిత్ర ఆధారంగా నీరజ్ పాండే ఓ చిత్రాన్ని తెకెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 12 Aug 2026 5:00 AM ISTప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ (పంచమ్ దా) జీవిత చరిత్ర ఆధారంగా నీరజ్ పాండే ఓ చిత్రాన్ని తెకెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. బర్మన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. బర్మన్ పాత్రకు హష్మీ పర్పెక్ట్ గా సెట్ అవుతున్నాడని పట్టుబట్టి మరీ ఎంపిక చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కోడై కూసింది. అయితే ఇప్పుడా పాత్రకు ఫర్హాన్ అక్తర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పాత్ర కోసం బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర అతిథి పాత్ర మాత్రమే కాదు. ఇదొక ఎక్స్‌టెండెడ్ క్యామియో అని చిత్ర బృందం వెల్లడించింది. 10 రోజుల పాటు ఈ పాత్ర కోసం షూటింగ్‌లో అక్షయ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. అక్షయ్ కుమార్‌ను ఈ పాత్రకు ఎంపిక చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయనకున్న వ్యక్తిగత అనుబంధం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్, రాజేష్ ఖన్నా కుమార్తె ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
అలాగే రాజేష్ ఖన్నా మాజీ భార్య డింపుల్ కపాడియా, అక్షయ్‌కు అత్తగారు కావడంతో ఈ కుటుంబ అనుబంధం పాత్రకు మరింత సహజత్వాన్ని తెస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. రాజేష్ ఖన్నా .. ఆర్.డి. బర్మన్ మధ్య ఉన్న వృత్తిపరమైన అనుబంధం హిందీ చిత్ర పరిశ్రమలో చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో చిరస్మరణీయమైన పాటలు, సినిమాలు వచ్చాయి. ఆనాటి స్నేహాన్ని , సృజనాత్మక భాగస్వామ్యాన్ని వెండితెరపై పునసృష్టించడానికి అక్షయ్ కుమార్ సరైన ఎంపిక అని చిత్ర బృందం భావిస్తోంది.
రాజేష్ ఖన్నా అంటే అక్షయ్ కుమార్‌కు మొదటి నుండి ఎంతో అభిమానం. తన మామగారైన రాజేష్ ఖన్నా పాత్రను పోషించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అక్షయ్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా మరోసారి అక్షయ్ కుమార్ .. నీరజ్ పాండే జంట `స్పెషల్ 26`, `బేబీ` వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తుండటం విశేషం. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. బాలీవుడ్ లో బయోపిక్ లకు ఎప్పుడు తిరుగుండదు. కథలో సరైన ఎమోషన్ ఉంటే? బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో బయోపిక్ లు ఎప్పటికప్పుడు తెరకెక్కుతుంటాయన్నది తెలిసిందే.
