Begin typing your search above and press return to search.

జిమ్ కార్బెట్ రీక్రియేషన్.. ప్రియదర్శన్ మార్క్ కామిక్ థ్రిల్లర్‌!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్- దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు .

By:  Srikanth Kontham   |   2 Sept 2026 1:00 PM IST
జిమ్ కార్బెట్ రీక్రియేషన్.. ప్రియదర్శన్ మార్క్ కామిక్ థ్రిల్లర్‌!
X

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్- దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు . 'హేరా ఫేరి', 'గరం మసాలా', 'భూల్ భులయ్యా' వంటి సంచలన కామెడీ హిట్ల తర్వాత ఈ క్రేజీ జోడీ నుంచి వస్తున్న తొమ్మిదవ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇద్ద‌రి కాంబోలో తెరకెక్కిన 'హైవాన్' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగానే తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ తొమ్మిదవ ప్రాజెక్ట్ వన్యప్రాణి సంరక్షణ నేపథ్యంతో రూపుదిద్దుకోవ‌డం విశేషం.

ప్రముఖ రచయిత, పర్యావరణవేత్త , ప్రసిద్ధ వేటగాడు అయిన జిమ్ కార్బెట్ నిజ జీవిత ఘటనల ఆధారంగా అక్షయ్ కుమార్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 1960ల భారతదేశ నేపథ్యంతో నడిచే ఈ కథలో అక్షయ్ కుమార్ నైపుణ్యం కలిగిన వేటగాడిగా.. అలాగే అడవికి సంబంధించిన సూక్ష్మాలను క్షుణ్ణంగా గ్రహించగలిగే ట్రాకర్‌గా కనిపించనున్నారు. కథాంశం ప్రకారం... గ్రామీణ ప్రజలను భయాందోళనలకు గురిచేసే పులులు, చిరుతపులులను అంతం చేసే క్రమంలో ప్రారంభమయ్యే హీరో ప్రయాణం అటుపై పర్యావరణ పరిరక్షణ వైపు ఎలా? మలుపు తిరిగింది అనేది ప్రధాన ఇతివృత్తం.

వేట .. అటవీ నిర్మూలన వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని గ్రహించిన కథానాయకుడు క్రమంగా వన్యప్రాణుల సంరక్షకుడిగా మారే క్రమాన్ని ప్రియదర్శన్ తనదైన శైలిలో ఆవిష్క రించనున్నారు. ఇది పర్యావరణ సమస్య అయినా? సినిమాను తన మార్క్ కామిక్ థ్రిల్లర్‌గా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను అక్టోబర్ నుంచి ప్రారంభించడానికి చిత్ర బృందం సమాయత్తమవుతోంది. 'హైవాన్' విడుదలైన వెంటనే ప్రియదర్శన్ - ఆయన బృందం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో లొకేషన్ రెక్కీ నిర్వహించనున్నారు.

సహజసిద్ధమైన వాతావరణంలో చిత్రీకరించాలనే ఉద్దేశంతో 2027 జనవరి నుంచి ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు సంబంధించి కథానాయిక ఎంపిక జరుగుతోంది. అక్షయ్ కుమార్ క్యారెక్టరైజేషన్, 1960ల నాటి అటవీ నేపథ్యం ,ప్రియదర్శన్ కామిక్ టైమింగ్ అన్నీ కలసి సినిమాను సరికొత్త అనుభూతిగా మార్చబోతున్నాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ కాంబో వైల్డ్‌లైఫ్ థ్రిల్లర్‌తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సవాళ్లతో కూడిన భిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు. మరి పర్యావరణ పరిరక్షణ అనే సామాజిక అంశానికి కామెడీని జోడించి తెరకెక్కించే ప్రయోగం వెండి తెరపై ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.