ముంబై రియల్ ఎస్టేట్‌లో ఖిలాడీ అస్సెట్!
తాజాగా ఆయన ముంబైలోని ఓ ప్రముఖ నివాస ప్రాంతంలో రెండు ఫ్లాట్లను భారీ ధరకు విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
By: Srikanth Kontham | 5 Jun 2026 11:46 AM ISTచిత్ర పరిశ్రమలో అగ్ర తారలు సంపాదన సినిమాలతోనే ఆగడం లేదు. రకరకాల వ్యాపారాలు -రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల ద్వారా సంపదను అంత కంతకు పెంచుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఆర్థిక వ్యూహాన్ని చక్కగా అమలు చేయడంలో ముందున్నారు. తాజాగా ఆయన ముంబైలోని ఓ ప్రముఖ నివాస ప్రాంతంలో రెండు ఫ్లాట్లను భారీ ధరకు విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ముంబైలోని బోరివలి (ఈస్ట్) పరిధిలో గల ప్రతిష్టాత్మక అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులో అక్షయ్ కుమార్‌కు ఉన్న రెండు ఫ్లాట్లు ఇటీవల 7.1 కోట్ల ధరకు విక్రయించారు.
ఆస్తి రిజిస్ట్రేషన్ల రికార్డుల ప్రకారం జూన్ 2026 మొదటి వారంలో ఈ లావాదేవీ ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు నివాస ప్రాపర్టీలను ఒకే కొనుగోలుదారు సొంతం చేసుకోవడం విశేషం. ఈ అమ్మకం ద్వారా ముంబై సబర్బన్ ప్రాంతాలలో లగ్జరీ - సెమీ-లగ్జరీ గృహాలకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. విక్రయించిన ఆస్తుల వివరాల్లోకి వెళితే దాదాపు 1101 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఒక పెద్ద అపార్ట్‌మెంట్ 5.75 కోట్లకు అమ్ముడుపోగా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో భారీ మొత్తమే చెల్లించారు. అలాగే అదే అంతస్తులో ఉన్న 252 చదరపు అడుగుల మరొక చిన్న స్టూడియో ఫ్లాట్ 1.35 కోట్లకు అమ్ముడైంది.
గతంలో 2017 నాటి కొనుగోలు ధరలతో పోల్చి చూస్తే ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం ఈ ఆస్తులపై రెట్టింపు రాబడి లాభాలు ఆర్జించారు. అక్షయ్ కుమార్ కేవలం ఈ బోరివలి ఫ్లాట్లకే పరిమితం కాలేదు. గత కొంతకాలంగా ముంబైలోని రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను వ్యూహాత్మకంగా మానిటైజ్ చేస్తున్నారు. గత ఏడాది వర్లి ప్రాంతంలోని లగ్జరీ నివాసాన్ని 80 కోట్లకు, లోయర్ పరేల్ పరిధిలోని కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌ను 8 కోట్లకు విక్రయించి లాభాలు గడించారు. దీనిని బట్టి అక్షయ్ కేవలం ఆస్తులను కొనుగోలు చేయడమే కాదు. మార్కెట్ గరిష్టంగా ఉన్నప్పుడు వాటిని వదులుకోవడానికి కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది.
సాధారణంగా సెలబ్రిటీలు చేసే ఇలాంటి భారీ రియల్ ఎస్టేట్ లావాదేవీలు వారి వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు మాత్రమే కాకుండా సదరు ప్రాంతాల మార్కెట్ సెంటిమెంట్‌ను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఒక అగ్ర నటుడు ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడం ..విక్రయించడం అనేది సదరు బిల్డింగ్ లేదా పరిసర ప్రాంతాల వ్యాల్యుయేషన్‌ను పెంచడానికి దోహదపడుతుంది. స్థిరమైన .. దీర్ఘకాలిక భద్రతను ఇచ్చే రియల్ ఎస్టేట్ రంగాన్ని సెలబ్రిటీలు ప్రధాన పెట్టుబడి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని స్థిరమైన ఆస్తులుగా మార్చడం.. ఆపై మార్కెట్ ఒడిదొడుకులను గమనిస్తూ సరైన సమయంలో వాటిని విక్రయించడం అనేది పరిణతి చెందిన ఆర్థిక ప్రణాళికకు నిదర్శనం.
