Begin typing your search above and press return to search.

100 కోట్లు FD చేస్తే లైఫ్ సెటిల్ అనుకున్న హీరో

దానికి ఆ తండ్రి న‌వ్వి ఊరుకోవ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీ లేదు. కానీ అంత చిన్న వ‌య‌సులో ఆ ఆలోచ‌న రావ‌డం కూడా గొప్పే.

By:  Sivaji Kontham   |   24 Sept 2025 2:00 AM IST
100 కోట్లు FD చేస్తే లైఫ్ సెటిల్ అనుకున్న హీరో
X

బాగా డ‌బ్బు సంపాదించాలి. లైఫ్ లో సెటిల‌వ్వాలి. ఈ హీరో కూడా అలాగే ఆలోచించాడు. 100 కోట్లు ఎఫ్.డి చేసిన ప్ర‌ముఖ హీరో నెల‌కు కోటిన్న‌ర చొప్పున వ‌డ్డీ అందుకుంటున్నాడ‌ని ఎక్క‌డో న్యూస్ పేప‌ర్లో చ‌దివిన ఒక హీరో గారు ప‌రిగెట్టుకుంటూ వెళ్లి తండ్రిగారిని ఇలా అడిగాడు. నాన్న నేను కూడా 100 కోట్ల ఎఫ్.డి క‌డితే లైఫ్ సెటిలైన‌ట్టే క‌దా? అని ప్ర‌శ్నించాడు. దానికి ఆ తండ్రి న‌వ్వి ఊరుకోవ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీ లేదు. కానీ అంత చిన్న వ‌య‌సులో ఆ ఆలోచ‌న రావ‌డం కూడా గొప్పే.

అత‌డు వంద కోట్లు ఎఫ్‌.డి చేసాడా లేదా? అన్న‌ది అటుంచితే .. త‌న అప‌రిపక్వ ద‌శ గురించి గ్ర‌హించిన‌ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చాడు. ``జీతేంద్ర సాహబ్ (బాలీవుడ్ దిగ్గ‌జ హీరో) రూ. 100 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేశాడని చాలా కాలం క్రితం ఒక వార్తా కథనాన్ని చదివాను. నాకు ఇప్పటికీ గుర్తుంది.. నేను నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్లాను. నాన్న ఎవరైనా రూ. 100 కోట్ల FD చేస్తే వడ్డీ ఎంత ఉంటుంది? అని అడిగాను. ఆ సమయంలో వడ్డీ రేటు 13 శాతం ఉంది. అంటే నెలకు రూ. 1.3 కోట్లు ఖాతాలో వ‌డ్డీ రూపంలో జ‌మ అవుతుంది. నేను అలాంటి FDని సృష్టించగలిగిన రోజు ఆర్థికంగా సురక్షితంగా ఉంటాను అని అనుకున్నాను. కానీ మ‌నిషి ఎప్పుడూ సంతృప్తి చెందడు. ఆ సంఖ్య నాకు పెరుగుతూనే ఉంది. రూ. 100 కోట్ల నుండి రూ. 1,000 కోట్లకు, ఆ తర్వాత రూ. 2,000 కోట్లకు పెరిగింది. దురాశ ఎప్పటికీ అంతం కాదని గ్ర‌హించాను.. అని చెప్పాడు.

క‌ట్ చేస్తే ఈ ప్ర‌ముఖ హీరో త‌న కెరీర్ లో ఇంతింతై ఎదిగి ఏకంగా 2000 కోట్లు సంపాదించాడు. ఇంత సంపాదించిన త‌ర్వాత అత‌డు ఎఫ్.డిలు చేయ‌లేదు. లాభ‌సాటి వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాడు. వేగంగా ఎద‌గ‌డానికి దారులు వాటంత‌ట అవే తెరుచుకున్నాయి. డ‌బ్బు టు ద ప‌వ‌రాఫ్ డ‌బ్బు రిపీటైంది. ద‌శాబ్ధాలు గ‌డిస్తేనే ఎఫ్‌.డి వ‌డ్డీలు పెద్ద‌గా క‌నిపిస్తాయి. కానీ వ్యాపారంలో స‌క్సెసైతే, రెండు మూడేళ్ల‌లోనే బాద్ షా అయిపోవ‌చ్చ‌ని నిరూపించాడు. ఈ ప్ర‌ముఖ హీరో మ‌రెవ‌రో కాదు... ఖిలాడీ అక్ష‌య్ కుమార్.

అక్షయ్ కుమార్ కెరీర్ ఇటీవ‌ల బ్యాడ్ ఫేజ్ లో ఉంది. కానీ అత‌డిని ఆదుకునేందుకు వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఎన్న‌టికీ త‌ర‌గ‌నంత ఆస్తుల్ని అత‌డు ఇప్ప‌టికే కూడ‌గ‌ట్టాడు. కాబ‌ట్టి అత‌డి జీవితం అంద‌రికీ ఆదర్శం.